తెలంగాణ కిచెన్ : ఇలా ట్రై చేయండి..మామిడి పండుతో వెరైటీ వంటలు

తెలంగాణ కిచెన్ : ఇలా ట్రై చేయండి..మామిడి పండుతో వెరైటీ వంటలు

మే నెల అంటే మామిడి పండ్ల పండగే. ఎర్రటి ఎండలకు మామిడి పండ్లతో జ్యూస్​, మిల్క్​షేక్​, స్వీట్స్​ చేసుకుని తింటే మజాగా ఉంటుంది అనుకుంటున్నారా!  కానీ, ఎర్రటి ఎండలకు చెక్​ పెట్టేందుకు మధ్యమధ్యలో వానలు కురిసి వాతావరణాన్ని కాస్త చల్లబరిచాయి. ఎండ, వాన ఏదైతేనేం మామిడి పండ్లను మాత్రం వదిలేదే లేదు అంటారు మ్యాంగో లవర్స్​. అందుకే చల్లబడిన వాతావరణంలో మామిడి పండ్లతో వెరైటీ వంటలు వండుకుని తినొచ్చు! కాకపోతే తీపి రుచి ఇష్టపడేవాళ్లకు కాస్త ఎక్కువ నచ్చుతాయి ఈ వంటలు.

సందేశ్​

కావాల్సినవి :

పాలు - ఒకటిన్నర లీటరు
వెనిగర్ - ఒకటిన్నర టేబుల్ స్పూన్
చక్కెర - ఎనిమిది టేబుల్ స్పూన్లు
నీళ్లు - సరిపడా
కార్న్​ఫ్లోర్ - రెండున్నర టీస్పూన్లు
యాలక్కాయ - ఒకటి
మామిడి పండ్లు - రెండు
పిస్తా, బాదం పలుకులు 
ఎండిన గులాబీ రేకులు -
కొన్ని
మామిడి పండు గుజ్జు - ఒక కప్పు

తయారీ : పాలు కాగబెట్టాక వెనిగర్ వేసి పాలను విరగ్గొట్టాలి. విరిగిన పాలను వడకట్టాలి. మిగిలిన పాల ముద్దను పాన్​లో వేయాలి. అందులో చక్కెర కూడా వేసి మిశ్రమం సాఫ్ట్​గా అయ్యేంతవరకు కలపాలి. తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ఒక గిన్నెలో వేసి సమంగా పరవాలి. దానిపైన మామిడి పండు ముక్కలు పెట్టి వాటి మీద పాల మిశ్రమం వేయాలి. దానిపైన పిస్తా, బాదం పలుకులు, ఎండిన గులాబీ రేకులు చల్లి అరగంట ఫ్రిజ్​లో పెట్టాలి. ఒక పాన్​లో మామిడి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ చక్కెర, కార్న్​ ఫ్లోర్ వేసి బాగా కలిపి సాస్​ తయారుచేయాలి. సాస్ చల్లారాక ఫ్రిజ్​లో పెట్టిన మ్యాంగో మిశ్రమాన్ని తీసి ముక్కలుగా తరగాలి. వాటిపైన మామిడిపండు సాస్​ వేసుకుని తింటే ఆహా మధురం అనాల్సిందే. 

యోగర్ట్ 

కావాల్సినవి :

పెరుగు - ఒక కప్పు, మామిడి పండు - ఒకటి
పాలు - నాలుగు కప్పులు
చక్కెర - పావు కప్పు

తయారీ : మామిడి పండ్లు తొక్క తీసి, ముక్కలు తరగాలి. వాటిని మిక్సీ జార్​లో వేసి గ్రైండ్ చేయాలి. ఆ పేస్ట్​ని పాన్​లో వేసి నీళ్లన్నీ పోయి మిశ్రమం గట్టిపడే వరకు ఉడికించాలి. తర్వాత దాన్ని చల్లారబెట్టాలి. మరో పాన్​లో పాలు కాగబెట్టి అందులో చక్కెర వేసి కలపాలి. పెరుగుని ఒక కాటన్​ క్లాత్​లో వేసి మూటకట్టి గంటసేపు పక్కన పెట్టాలి. ఆ తరువాత పెరుగుని బాగా గిలకొట్టి మామిడి పండు మిశ్రమంలో కలపాలి. అవి రెండూ బాగా కలిసిపోయాక గోరువెచ్చని పాలను కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక మట్టికుండలో పోసి పైన మూతపెట్టి వెచ్చగా ఉండే ప్లేస్​లో ఎనిమిది గంటలు పెట్టాలి. ఆ తర్వాత మూత తీసి తింటే టేస్ట్ అదిరిపోద్ది. 

దోశ

కావాల్సినవి  :

ఇడ్లీ బియ్యం - ఒక కప్పు
మామిడి పండు - ఒకటి
యాలక్కాయ - ఒకటి
అటుకులు (నానబెట్టి) - పావు కప్పు
బెల్లం - పావు కప్పు
ఉప్పు, నీళ్లు - సరిపడా

తయారీ : ఇడ్లీ బియ్యాన్ని కడిగి, రెండు గంటలు నానబెట్టాలి. మామిడి పండు తొక్క తీసి ముక్కలు తరగాలి.  మిక్సీజార్​లో మామిడి పండు ముక్కలు, యాలక్కాయ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో నానబెట్టిన బియ్యం, పోహ వేయాలి. ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరువాత అందులో బెల్లం, ఉప్పు వేసి నీళ్లు పోసి మరోసారి మెత్తగా మిక్సీపట్టాలి. రెడీ అయిన పిండిని గిన్నెలో వేసి మూత పెట్టి ఒక గంటసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పెనం మీద దోశ వేసి, నెయ్యితో రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాలిస్తే మ్యాంగో దోశ రెడీ.

పండు  పచ్చడి

కావాల్సినవి :

మామిడి పండ్లు - మూడు
కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
నూనె - ఒక టేబుల్ స్పూన్
ఆవాలు - ఒక టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - మూడు
కరివేపాకు - కొంచెం
అల్లం ముక్క - ఒకటి
వెల్లుల్లి రెబ్బలు - పది
ఇంగువ - అర టీస్పూన్
మెంతి పొడి - ఒక టీస్పూన్
బెల్లం పాకం - రెండు టేబుల్ స్పూన్లు
కశ్మీరీ కారం - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
వెనిగర్ - రెండు టేబుల్ స్పూన్లు

తయారీ : పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేగించాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఎండు మిర్చి వేయాలి. అవి వేగాక కారం, మామిడి పండు ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత ఉప్పు, ఇంగువ, మెంతి పొడి, వెనిగర్ వేయాలి. అన్నింటినీ ఒకసారి కలిపాక బెల్లం పాకం వేసి మరోసారి బాగా కలపాలి. నోరూరించే పండు మామిడి పచ్చడి అన్నం, చపాతీల్లో తింటే టేస్టీగా ఉంటుంది. 

మ్యాంగో ఇడ్లీ

కావాల్సినవి :

బొంబాయి రవ్వ - అరకప్పు
మామిడి పండు - ఒకటి
చక్కెర - పావు కప్పు
యాలక్కాయ - ఒకటి
పాలు లేదా నీళ్లు - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - సరిపడా

తయారీ : మామిడి పండు తొక్క తీసి ముక్కలు తరిగి మిక్సీజార్​లో వేయాలి. అందులోనే చక్కెర, యాలక్కాయ గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ వేసి, అందులో పేస్ట్​ చేసిన మామిడి పండు మిశ్రమం వేసి బాగా కలిపి, మూత పెట్టాలి. అరగంట తర్వాత మూత తీసి... పిండిని బాగా కలిపి అందులో పాలు లేదా నీళ్లు పోయాలి. రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి. ఇడ్లీ ప్లేట్లకి నూనె పూసి అందులో పిండి వేయాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీలు వేసిన ప్లేట్​లను పెట్టి, మూతపెట్టి పావుగంట ఉడికించాలి. సాఫ్ట్​గా, తియ్యగా, మ్యాంగో ఫ్లేవర్​ ఇడ్లీ రెడీ. ఇది మినీ కేక్​లా ఉంటుంది. తింటుంటే.

రైస్

కావాల్సినవి :

మామిడి పండు గుజ్జు - ఒక కప్పు
బాస్మతి బియ్యం - ఒక కప్పు
మామిడి పండు ముక్కలు - ఒక కప్పు
ఆవాలు - ఒక టీస్పూన్
ఇంగువ - పావు టీస్పూన్
మినప్పప్పు - మూడు టీస్పూన్లు
ఎండు మిర్చి - ఒకటి
పచ్చిమిర్చి - ఒకటి
జీడిపప్పులు - కొన్ని
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు - కొంచెం
నూనె, ఉప్పు - సరిపడా

తయారీ : బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, మినప్పప్పు, ఇంగువ, జీడిపప్పులు వేసి వేగించాలి. అవన్నీ వేగాక మామిడి పండు ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. తర్వాత అన్నం వేసి బాగా కలపాలి. అందులో మామిడి పండు గుజ్జు కూడా వేసి మరోసారి కలిపితే తియ్యటి మ్యాంగో రైస్ రెడీ.