ఆధారాలు లేని పిటిషన్‌‌‌‌ వేసినందుకు రూ.25 వేలు జరిమానా

ఆధారాలు లేని పిటిషన్‌‌‌‌ వేసినందుకు రూ.25 వేలు జరిమానా
  • పిటిషనర్​పై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ఆధారాలు లేకుండా కోర్టు ధిక్కార పిటిషన్‌‌‌‌ దాఖలు చేసిన పిటిషనర్‌‌‌‌కు హైకోర్టు రూ.25 వేల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆధారాలు ల్లేకుండా కోర్టు ధిక్కార పిటిషన్‌‌‌‌ వేయడం.. ప్రతివాద కక్షిదారులను బెదిరించమేనని అబిప్రాయపడింది. ఇలాంటి పిటిషన్‌‌‌‌ వేసి ప్రతివాదులను బెదిరించే ప్రయత్నం చేయడమేనని పేర్కొంది. పిటిషనర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ నయీమ్‌‌‌‌కు రూ.25 వేలు జరిమానా విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లోగా స్టేట్‌‌‌‌ లీగల్‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌ అథారిటీకి చెల్లించాలని జస్టిస్‌‌‌‌ ఎ.లక్ష్మీనారాయణ తీర్పులో పేర్కొన్నారు. 

హైదరాబాద్‌‌‌‌ ట్రూప్‌‌‌‌ బజార్‌‌‌‌లోని ఓ భూమిని 2001లో నవేదిత మాన్వికర్‌‌‌‌ నుంచి వ్యాపారవేత్త మహ్మద్‌‌‌‌ నయీమ్‌‌‌‌ అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి యాజమాన్య హక్కులు పొందే ప్రయత్నంలో భాగంగా సివిల్‌‌‌‌ కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్​ను కింది కోర్టు పిటిషన్‌‌‌‌ను 2017లో కొట్టివేసింది. 

దీంతో హైకోర్టులో వ్యాజ్యం వేసి తుది తీర్పు వెలువడే వరకు భూమిని ఎవరికీ విక్రయించరాదనే మధ్యంతర ఆదేశాలు పొందారు. అయితే, నవేదిత ఆస్తిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారంటూ నయీమ్‌‌‌‌ కోర్టు ధిక్కార పిటిషన్‌‌‌‌ వేస్తే హైకోర్టు విచారించింది. విక్రయానికి సంబంధించి నయీమ్‌‌‌‌ ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో పిటిషన్‌‌‌‌ను హైకోర్టు డిస్మిస్‌‌‌‌ చేసింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు నయీమ్‌‌‌‌కు రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.