రోజుకో గ్యాస్ షిప్ అవసరం.. ఈ నెల వచ్చింది రెండే.. పొంచి ఉన్న గ్యాస్ గండం..!

రోజుకో గ్యాస్ షిప్ అవసరం.. ఈ నెల వచ్చింది రెండే.. పొంచి ఉన్న గ్యాస్ గండం..!

దేశంలో ప్రతి వంటింట్లోనూ ఎల్‌పీజీ సిలిండర్ ఇప్పుడు ఒక అనివార్య అవసరంగా మారింది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరగకపోవడం ఇప్పుడు అతిపెద్ద సవాలుగా మారింది. భారత్ తన వంటగ్యాస్ అవసరాలను తీర్చుకోవడానికి నెలకు సగటున 29 నుండి 34 భారీ ఎల్‌పీజీ ట్యాంకర్లను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో నౌక సామర్థ్యం 46వేల టన్నులుగా తీసుకుంటేనే ప్రస్తుత డిమాండ్ అందుకోవటం కుదురుతుందని లెక్కలు చెబుతున్నాయి. 

గత రెండు దశాబ్దాలలో ఇండియన్స్ డొమెస్టిక్ గ్యాస్ వినియోగం భారీగా పెరిగింది. 1998-99లో నెలకు కేవలం 5.35 లక్షల టన్నులుగా ఉన్న వినియోగం.. 2024-25 నాటికి ఏకంగా 6 రెట్లు పెరిగి 31.3 లక్షల టన్నులకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల వంటి పథకాల ద్వారా క్లీన్ కుకింగ్ ఎనర్జీ ప్రతి ఇంటికీ చేరడం దీనికి ప్రధాన కారణం. కానీ ఇదే కాలంలో దేశీయ ఉత్పత్తి మాత్రం 3.6 లక్షల టన్నుల నుంచి కేవలం 12.8 లక్షల టన్నులకు మాత్రమే పెరిగింది. అంటే వినియోగం పెరుగుతున్న వేగంతో పోలిస్తే ఉత్పత్తి అడుగులు చాలా నెమ్మదిగా పడుతున్నాయి.

ప్రభుత్వ అంచనాల ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ డిమాండ్ నెలకు 29 లక్షల టన్నులకు చేరుకోనుంది. ఒకవేళ మనం మన గ్యాస్ ఉత్పత్తిని 30 శాతం పెంచినప్పటికీ.. నెలకు ఇంకా 14 లక్షల టన్నుల కొరత ఉంటుందట. ఇది భర్తీ చేయాలంటే నెలకు 15.6 లక్షల టన్నుల దిగుమతులు అవసరం. ఉత్పత్తిని 50 శాతం పెంచినా కూడా.. మనం నెలకు 13.4 లక్షల టన్నుల దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇది భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ఎత్తి చూపుతోంది.

మరో ఆందోళనకర అంశం ఏమిటంటే.. మన దిగుమతుల్లో అధిక భాగం యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. అక్కడ ఏదైనా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తితే.. మన వంటిళ్లలో మంట ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే భారత్ ఇప్పుడు అమెరికా, కెనడా, అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాల్లో సిలిండర్ రీఫిల్ సైకిల్ అంటే ప్రజలు వాడుతున్న స్పీడు 3 వారాలుగా ఉండటం వల్ల సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెల ఇప్పటి వరకూ జస్ట్ రెండు షిప్పులు మాత్రమే రావటంతో త్వరలోనే గ్యాస్ కష్టాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి.