హైటెక్ సిటీ మెహెఫిల్ రెస్టారెంట్, రాయదుర్గం షా గౌస్లో ఇంత ఘోరమా..? చూస్తే తినలేం.. వాంతులే..!

హైటెక్ సిటీ మెహెఫిల్ రెస్టారెంట్, రాయదుర్గం షా గౌస్లో ఇంత ఘోరమా..? చూస్తే తినలేం.. వాంతులే..!

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. పేరు గాంచిన ప్రముఖ హోటళ్లలో పరిశుభ్రత లోపాలు వరుసగా బయటపడుతున్నాయి. కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్, హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్, రాయదుర్గంలోని షా గౌస్, గచ్చిబౌలిలోని నవాబ్ రెస్టారెంట్, ఖాజాగూడ ఇగురు రెస్టారెంట్, రామేశ్వరం కేఫ్లలో లోపాలు బయటపడ్డాయి.

ఈ రెస్టారెంట్లలో కిచెన్లు.. మరీ ముఖ్యంగా హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్లో కిచెన్లు ఎంత డర్టీగా ఉన్నాయంటే చూస్తేనే వాంతొచ్చేలా ఉన్నాయి. అంత అధ్వానంగా, అపరిశుభ్రంగా కిచెన్లు ఉండటం చూసి అధికారులు విస్తుపోయారు. ఎక్స్‌పైరీ అయిన, నిల్వ ఉంచిన పాత ఆహార పదార్థాలను వంటల్లో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ సీలింగ్‌లు, గోడలు, లైట్లపై గ్రీజు, దుమ్ము పేరుకుపోయినట్లు గుర్తించారు.

కిచెన్ ప్రాంతంలోనే ఓపెన్ డ్రైన్లు, ఆహార వ్యర్థాలు పేరుకుపోయినట్లు గుర్తించారు. పలు రెస్టారెంట్ల కిచెన్లలో ఈగలు, ఎలుకలు, బల్లులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు హానికరమైన ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు పలు తనిఖీల్లో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. కిచెన్ సిబ్బంది గుట్కా నములుతూ వంటలు చేస్తున్న ఘటనలపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రెండు రోజుల క్రితం వండిన ఆహారాన్ని ఫ్రీజర్లలో నిల్వ చేసి మళ్లీ కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పలు రెస్టారెంట్లలో బయటపడింది. గడువు ముగిసిన ఫుడ్ ప్రొడక్ట్స్, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని అధికారులు ధ్వంసం చేశారు. తనిఖీల్లో లోపాలు బయటపడ్డ రెస్టారెంట్లకు అధికారులు కేవలం నోటీసులిచ్చి వదిలేస్తుండటంతో రెస్టారెంట్ల నిర్వాహకులు తిరిగి మళ్లీ అలాగే కంటిన్యూ చేస్తుండటం గమనార్హం.