డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టులో గురువారం (జులై 13న) విచారణ జరిగింది. విచారణకు జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ లోకేష్ కుమార్ హాజరయ్యారు. ప్రాథమికంగా కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా న్యాయస్థానానికి లోకేష్ కుమార్ క్షమాపణ చెప్పారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను ఎందుకు పాటించలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం సెలవు రోజు ఎందుకు కూల్చాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అక్రమంగా నిర్మించిన బిల్డింగ్స్ ను ఆదివారం రోజు ఇప్పటి వరకు ఎన్ని  కూల్చారని అడిగింది. 

కోర్టు ఆర్డర్ తమకు తెలియదని న్యాయస్థానానికి తెలిపారు లోకేష్ కుమార్. కోర్టు ఆర్డర్ తెలియదంటే మేము నమ్మాలా అని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. సామాన్యులకు ఒక న్యాయం పలుకుబడి ఉన్న ధనవంతుల ఒక న్యాయమా...? అని ప్రశ్నించింది. హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ప్రతి రోజు కూల్చివేయిస్తామని లోకేష్ కుమార్  తెలిపారు. ఇప్పటికే వేలాది కట్టడాలను కూల్చివేయించామని చెప్పారు. కొన్ని సీరియస్ కండిషన్ లో మాత్రమే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటామని వివరించారు. 

కూల్చివేతలు జరుగుతున్నపుడు వీడియోగ్రఫీ చేశారా..? ఎంతమంది పోలీసుల భద్రత కల్పించారు..? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు స్టే ఉందని తెలిసినా ఎలా కూల్చివేత చేపట్టారని ప్రశ్నించింది. న్యాయస్థానం ఆదేశాలను జీహెచ్ఎంసీ పాటించదా..? అని పేర్కొంది. పోలీసుల భద్రత మధ్య అంతత్వరగా డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేత చేపట్టారని వ్యాఖ్యానించింది హైకోర్టు.

డెక్కెన్ కిచెన్ హోటల్ కూల్చివేత సమయంలో తీసిన వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ సమర్పించాలని పిటిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ దాఖలు చేసిన కౌంటర్ కు రీప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. విచారణకు డిప్యూటీ సిటీ ప్లానర్ హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.