భార్య పుట్టినరోజుకు భర్త స్పెషల్ గిఫ్ట్..! ఆకాశమంత ప్రేమ..

భార్య పుట్టినరోజుకు భర్త స్పెషల్ గిఫ్ట్..! ఆకాశమంత ప్రేమ..

టమాటాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టమాటా ధరలు ఎంతలా భయపెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా అంటే అన్నీ రాష్ట్రాల్లోనూ కిలో 100రూపాయలకుపైగానే విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే..160 రూపాయలకు పైగా ధర పలుకుతోంది. టమాటా ధర పెట్రోల్‌ని మించిపోయి...బంగారం రేటుతో పోటీ పడుతోందనే మీమ్స్‌ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

పెరిగిన ధరలతో ఓ భర్త తన భార్య పుట్టినరోజు కానుకగాకు టమాటాలను గిఫ్ట్ గా ఇచ్చి.. ఆశ్చర్యపరిచాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో సోనాల్ బోర్సే అనే వివాహిత పుట్టినరోజుకు ఆమె భర్త, బంధువులు టమాటాలను కానుకగా ఇచ్చారు. 4 కిలోలకు పైగా టమాటాలు కానుకగా ఇచ్చి ఆకాశమంత ఎదగాలని దీవించారు. 

కల్యాణ్‌ పట్టణంలోని కొచాడి ప్రాంతంలో నివసిస్తున్న సోనాల్‌ బోర్సే పుట్టినరోజు వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం రోజు (జులై 9న) నిర్వహించారు. బర్త్ డే కానుకగా వచ్చిన టమాటాలను చుట్టూ పెట్టుకొని కేక్‌ కట్‌ చేశారు. తన భర్త, సోదరుడు, బంధువులు ఇచ్చిన ఈ కానుక ఎంతో సంతోషపరచిందని చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారడంతో నెటిజన్లు కూడా ఐడియా అదిరిపోయింది అంటూ కామెంట్స్ తో నెట్టింట్లో కేక పుట్టిస్తున్నారు. 

నిన్న, మొన్నటి వరకు రూ.10, రూ.20కి దొరికిన కేజీ టమాటా ఒక్కసారిగా రూ.100 దాటింది. తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. రోజూ వినియోగించే టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టమాటాలు కొనడానికే వెనకాడుతున్నారు. ఇదిలా ఉంటే.. టమాటా ధర పెరుగుదల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్‌ క్రియేట్ చేసి నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న టమాటా సాస్ ధరల్ని.. మార్కెట్‌లో టమాటా ధరలతో పోలుస్తూ.. ‘టమాటా ధర కంటే సాస్‌ ధర తక్కువగా ఉందే’ అంటూ పోస్ట్‌ చేస్తున్నారు. మరి కొందరైతే బంగారం ధరలతో పోలుస్తున్నారు. దీంతో సోషల్‌మీడియాలో టమాటా మీమ్స్‌ పోటెత్తాయి.