మున్సిపోల్స్‌‌ నామినేషన్లు : రంగారెడ్డిలో హయ్యెస్ట్‌‌.. భూపాలపల్లిలో లోయెస్ట్‌‌

మున్సిపోల్స్‌‌ నామినేషన్లు : రంగారెడ్డిలో హయ్యెస్ట్‌‌.. భూపాలపల్లిలో లోయెస్ట్‌‌
  • రంగారెడ్డిలో హయ్యెస్ట్‌‌.. భూపాలపల్లిలో లోయెస్ట్‌‌
  • ఆరు జిల్లాల్లో వెయ్యికి పైగా నామినేషన్లు
  • చివరిరోజు భారీగా ఫైల్​ చేసిన అభ్యర్థులు
  • ఆన్‌‌లైన్‌‌కు ఆదరణ కరువు..19 జిల్లాల్లో నిల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్‌‌ ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 120 మున్సిపాల్టీలు, 9 కార్పొరేషన్లలో నామినేషన్లు దాఖలు చేయడానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాత్రి 7.45 గంటల వరకు జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం మొత్తం 21,850 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 967 మందే నామినేషన్లు వేయగా, రెండో రోజు 4,722 మంది, చివరి రోజు 16,161 మంది నామినేషన్లు వేశారు. మున్సిపల్‌‌ ఎన్నికల్లో ఆన్‌‌లైన్‌‌లో నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించినా.. దానికి అంతగా ఆదరణ కనిపించలేదు. 19 జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఒక్కటంటే ఒక్క నామినేషన్‌‌ కూడా ఆన్‌‌లైన్‌‌లో రాలేదు.

రంగారెడ్డిలో 2,392.. భూపాలపల్లిలో 134

మున్సిపల్‌‌ నామినేషన్లలో రంగారెడ్డి ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలవగా జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా చివరి స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో 2,392 నామినేషన్లు దాఖలయ్యాయి. మేడ్చల్‌‌ మల్కాజిగిరిలో 1,910, నల్గొండ 1,533, పెద్దపల్లి 1,128, సూర్యాపేట 1,073, నిజామాబాద్‌‌ 1,043, సంగారెడ్డి 981, మంచిర్యాల 910, జగిత్యాల 904, కరీంనగర్‌‌ 823, వికారాబాద్‌‌ 709, సిద్దిపేట 685, వనపర్తి 661, యాదాద్రి భువనగిరి 659, రాజన్న సిరిసిల్ల 633, మహబూబ్‌‌నగర్‌‌ 624, కామారెడ్డి 564, మెదక్‌‌ 554, నిర్మల్‌‌ 528, నారాయణపేట్‌‌ 525, మహబూబాబాద్‌‌ 470, నాగర్‌‌కర్నూల్‌‌ 452, వరంగల్‌‌రూరల్‌‌ 407, ఆదిలాబాద్‌‌ 387, జోగులాంబ గద్వాల్‌‌ 294, ఖమ్మం 291, జనగామ 207, భద్రాద్రి కొత్తగూడెం 187, కొమ్రం భీం ఆసిఫాబాద్‌‌ 182, జయశంకర్‌‌ భూపాలపల్లిలో 134 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంకా జిల్లాల నుంచి సమాచారం రావాలని ఈసీ వర్గాలు తెలిపాయి.

ఆన్‌‌లైన్‌‌లో 574 నామినేషన్లు

మున్సిపల్‌‌ ఎన్నికల్లో తొలిసారిగా ఆన్‌‌లైన్‌‌ నామినేషన్ల ప్రక్రియను తీసుకువచ్చారు. ఎలక్షన్‌‌ కమిషన్‌‌ వెబ్‌‌సైట్​లోని టీ- పోల్‌‌ పోర్టల్‌‌లో లాగిన్‌‌ అయి ఆన్‌‌లైన్‌‌లో నామినేషన్‌‌ పేపర్లు సబ్మిట్‌‌ చేయవచ్చని ఈసీ పేర్కొంది. ఆన్‌‌లైన్‌‌లో దాఖలు చేసే నామినేషన్ల ప్రింట్‌‌ ఔట్‌‌ను సంబంధిత రిటర్నింగ్‌‌ అధికారికి మాన్యువల్‌‌గా సమర్పిస్తేనే నామినేషన్‌‌ వేసినట్టుగా పరిగణిస్తామని మెలిక పెట్టడంతో దీనిపై క్యాండిడేట్లు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆన్‌‌లైన్‌‌ నామినేషన్‌‌లో అన్ని కాలమ్స్ పూర్తి చేస్తేనే సబ్మిట్‌‌ అవుతుందని, దీనివల్ల స్క్రూటినీలో నామినేషన్లు రిజెక్ట్‌‌ చేయకుండా అవుతుందని ఈసీ అధికారులు తెలిపారు. కానీ దీనిపై  పోటీకి దిగుతున్న క్యాండిడేట్లు అంతగా ఇంట్రస్ట్‌‌ చూపలేదు. నిజామాబాద్‌‌ జిల్లాలో ఆన్​లైన్​లో 304 నామినేషన్లు రాగా, మేడ్చల్‌‌ 140, వికారాబాద్‌‌ 55, పెద్దపల్లి 23, యాదాద్రి 16, గద్వాల 14, రంగారెడ్డి 9, సంగారెడ్డి 3, సిద్దిపేట, భద్రాద్రి జిల్లాల్లో ఒక్కో నామినేషన్‌‌ వచ్చాయి. మిగతా జిల్లాలో ఈ విధానంలో ఒక్క నామినేషన్‌‌ కూడా ఫైల్‌‌ కాలేదు.

 A large number of nominations have been filed for the upcoming municipal elections in the state