
- హైదరాబాద్ బోరబండకు చెందిన సబిల్ గా గుర్తింపు
- మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దుమ్పూర్లో ఘటన
శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దుమ్ పూర్ గ్రామ శివారులో ఓయువకుడు హత్యకు గురయ్యాడు. ముఖం గుర్తు పట్టకుండా బండరాయితో కొట్టి హత్య చేశారు. హైదరాబాద్ లోని బోరబండకు చెందిన మహమ్మద్ సబిల్(21)గా పోలీసులు గుర్తించారు. తూప్రాన్–నర్సాపూర్ రోడ్డు నుంచి పంట పొలాలకు వెళ్లే దారి పక్కన నగ్నంగా పడి ఉన్న డెడ్ బాడీని రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని తూప్రాన్ సీఐ రంగకృష్ణ పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆనవాళ్ల కోసం గాలించారు. ఎక్కడైనా హత్య చేసి డెడ్ బాడీని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా? లేదంటే ఇక్కడే బండరాయితో కొట్టి చంపారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే ఉన్న పొలంలో ఒక దగ్గర వాచ్, మరో దగ్గర ఉంగరం, చైన్, ఇంకో దగ్గర ఫోన్ ఇయర్ బడ్స్ బాక్స్, కొద్ది దూరంలో ఒక షూ లభించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రంగకృష్ణ తెలిపారు. ప్రేమ వ్యవహారమే సబిల్ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.