మేడ్చల్, వెలుగు: బైక్ కొనివ్వలేదని మద్యం మత్తులో నాయనమ్మను కొట్టి చంపాడో మనవడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడ్చల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన బందెల బాలమ్మ(62) కొడుకు మధు. ఇతనికి భార్య లక్ష్మి, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ప్రశాంత్(22) ఉన్నారు. మధు పెద్ద కూతురికి పెండ్లి చేసినప్పుడు బాలమ్మ కొంత డబ్బు ఇచ్చింది. ఇటీవల మరో కూతురి వివాహం కోసం డబ్బు ఇచ్చింది. ఈ క్రమంలో తాను బైక్కొనుక్కుంటానని, తనకు కూడా డబ్బు ఇవ్వాలని ప్రశాంత్ తన నాయనమ్మ బాలమ్మను అడిగాడు. అయితే బాలమ్మ ఇవ్వలేదు. దీంతో కోపం పెంచుకున్న ప్రశాంత్కొద్దిరోజులుగా బాలమ్మను కొడుతున్నాడు. కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ మార్పురాలేదు. శనివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ప్రశాంత్మరోసారి వృద్ధురాలిపై దాడి చేశాడు. తలను గోడకేసి కొట్టడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
