భార్య కాపురానికి రావడం లేదని టవరెక్కిన వ్యక్తి

 

 

 

  • నచ్చజెప్పి కిందకు దింపిన తాండూర్​ టౌన్ ​సీఐ
    పురుగుల మందు తాగానని చెప్పడంతో దవాఖానకు తరలింపు 

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా పాత తాండూరులో ఓ వ్యక్తి భార్య కాపురానికి రావడం లేదని, పురుగుల మందు తాగి సెల్ టవర్ ఎక్కాడు. దీంతో పోలీసులు అతడి భార్యతో మాట్లాడి తీసుకువస్తామని నచ్చజెప్పి కిందకు దింపారు. తర్వాత దవాఖానకు తరలించారు. వికారాబాద్​ జిల్లా బషీరాబాద్ మండలంలోని దామరచెడ్ గ్రామానికి చెందిన ఆంజనేయులు అలియాస్ అంజి (29) ఆదివారం మధ్యాహ్నం పాత తాండూర్ శివారులోని సెల్ టవర్ పైకి ఎక్కాడు. 

తన భార్య తన ఇంటికి వచ్చేంతవరకు టవర్ దిగి వచ్చేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు. సెల్ టవర్ పక్కన ఉన్న ఓ వ్యక్తి చూసి డయల్​100కు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆంజనేయులుకు ఎంత నచ్చజెప్పినా వినలేదు. రెండు గంటల పాటు సెల్ టవర్ పై ఉన్న ఆంజనేయులుకు పట్టణ సీఐ జి సంతోష్ కుమార్ నచ్చజెప్పారు. తన భార్యతో మాట్లాడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పడంతో దిగాడు. తాను పురుగుల మందు తాగానని చెప్పడంతో బాధితుడిని దవాఖానకు తరలించారు.