భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిండు

భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిండు
  •  తనను విడిచి ఉంటోందనే కోపంతో..అన్నపూర్ణ స్టూడియోలో ఘటన
  • మహిళకు గాయాలు, ఫర్నిచర్ దగ్ధం 

జూబ్లీహిల్స్​, వెలుగు: తనకు దూరంగా ఉంటోందన్న కోపంతో భార్యపై ఓ వ్యక్తి పెట్రోల్​ పోసి నిప్పంటించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్నాటకకు చెందిన నివ్యా వెల్వవితిన్​ నిశాంత్(31), మమెల్సన్​ రాజన్​ 2021లో పెండ్లి చేసుకొని, కొన్నాళ్లు సికింద్రాబాద్​లో నివాసం ఉన్నారు. 2022లో వీరికి ఒక బాబు పుట్టి అనారోగ్య కారణంగా కొన్ని రోజులకే చనిపోయాడు. 

ఆ తరువాత మద్యానికి బానిసైన మెల్సన్​ రాజన్​ నిత్యం భార్యతో గొడవ పడుతున్నాడు. దీంతో ఆమె ఏప్రిల్​లో అల్వాల్​ పోలీస్టేషన్​లో అతడిపై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. మధురానగర్​లోని ఓ ప్రైవేట్​ హాస్టల్​లో ఉంటూ అన్నపూర్ణ  ఫిల్మ్ అకాడమీలో అడ్మిషన్​ కౌన్సిలర్​ గా పనిచేస్తోంది. 

బుధవారం అన్నపూర్ణ స్టూడియోలోకి మెల్సన్​ రాజన్​ అనుమతి లేకుండా వచ్చాడు. తన భార్య పనిచేస్తున్న క్యాబిన్​ వద్దకు వెళ్లి అతని వెంట తీసుకువచ్చిన పెట్రోల్​ను ఆమెపై పోసి నిప్పంటించాడు. కేకలు వేయడంతో పక్కనుండే వారు వచ్చి కాపాడారు. ఆమె కాళ్లకు గాయాలయ్యాయి. ఆఫీస్​ ఫర్నిచర్, ల్యాప్​టాప్​ ఇతర సామగ్రి కాలిపోయాయి.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.