
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా పాలమాకుల వద్ద భద్రతా వలయాన్ని ఛేదించుకొని దూసుకొచ్చిన ఓ వ్యక్తి రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఇవాళ షాద్ నగర్ నుంచి ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర లింగారెడ్డి గూడ, చాంద్రాయణ గూడ, కొత్తూరు మీదుగా కొనసాగింది. పెద్దషాపూర్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న పాలమాకులలో ఈ ఘటన చోటు చేసుకుంది.
54 రోజుల క్రితం కన్యాకుమారి నుంచి పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆయన.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థల ప్రైవేటీకరణకు చెక్ పెట్టడంతో పాటు రాష్ట్రంలో ధరణి పోర్టల్ ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కున్న దళిత, గిరిజనుల భూములు తిరిగి ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.