తాగుబోతు భర్త..చిన్న కొడుక్కి అనారోగ్యం..జీవితంపై విరక్తితో మహిళ సూసైడ్

తాగుబోతు భర్త..చిన్న కొడుక్కి అనారోగ్యం..జీవితంపై విరక్తితో మహిళ సూసైడ్
  • పెద్ద కొడుకు చోరీ చేశాడని తిట్టిన  పొరుగింటి వ్యక్తి  
  • తట్టుకోలేక ఉరి పెట్టుకున్న వివాహిత

ఎల్బీనగర్, వెలుగు: భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడం, చిన్న కొడుకు అనారోగ్యంతో బాధపడుతుండడం, దీనికి తోడు పెద్ద కొడుకు  పక్కింట్లో ఓ వస్తువు తేగా, వారు వచ్చి నానా మాటలు అనడంతో  కలత చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన తన్నీరు నర్సింహా, సుధ(42) దంపతులు 15 ఏండ్ల కింద  నగరానికి వలస వచ్చారు. నాలుగేండ్లుగా వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని మారుతీనగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. నర్సింహా మద్యానికి బానిసై ఖాళీగా ఉంటున్నాడు. 

సుధ ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు స్థానిక ప్రభుత్వ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. చిన్న కొడుకు(12)కు చిన్నప్పటి నుంచే  డయాబెటిస్​ ఉంది. దీంతో  ప్రతీ రోజు మెడిసిన్ వాడాల్సి వస్తోంది. పెద్ద కొడుకు స్కూల్ కు వెళ్లడం లేదు. మంగళవారం పక్కింటి నుంచి ఓ రాడ్డు తీసుకువచ్చి రూ.25కు స్క్రాప్​ షాపులో అమ్మాడు. దీంతో ఆ ఇంటి యజమాని వచ్చి  గొడవ చేశాడు. 

పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా అంటూ సుధను గట్టిగా మందలించాడు. పెంచడం రాకుంటే పిల్లలను ఎందుకు కంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మహిళ పెద్ద కొడుకు తీసుకువచ్చిన రాడ్డును వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేశాడు. తన కుటుంబంలోని పరిస్థితులకు తోడు ఈ సంఘటనతో కలత చెందిన సుధ..  మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.