బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ బీసీ నేతల ధర్నా

బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటూ బీసీ నేతల ధర్నా
  • కులాల వారీగా జనాభా లెక్కించాలి
  • కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
  • ఢిల్లీలో బీసీ లీడర్ల డిమాండ్​
  • పార్లమెంట్​ స్ట్రీట్​లో మహా ధర్నా

న్యూఢిల్లీ,  వెలుగు: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి, ఏటా బీసీ కులాల అభివృద్ధికి రూ.రెండు లక్షల కోట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు.  త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జన గణనలో కుల గణన కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీ కులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నేతలు హాజరయ్యారు. ఆర్.కృష్ణయ్య తో పాటు పలు పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోనే 75 కోట్ల మంది ప్రజలకు కేంద్రంలో ఒక మంత్రిత్వశాఖ పెట్టవలసిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో బీసీల మంత్రిత్వశాఖలు ఉన్నప్పుడు, కేంద్రంలో ఎందుకు పెట్టరని ప్రశ్నించారు. వెంటనే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి,  స్కాలర్ షిప్ స్కీం, ఫీజు రీయింబర్స్​ మెంట్​ స్కీం, ప్రత్యేక నవోదయ పాఠశాలలు, కులవృత్తులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వాలని కోరారు.