- భువనగిరి సమీపంలోని వడపర్తి వద్ద ప్రమాదం
యాదాద్రి, వెలుగు : ఆటో, డీసీఎం ఢీకొన్న ప్రమాదంలో తల్లితో పాటు ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలోని వడపర్తి వద్ద సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన కేతమ్మ (56) గ్రామంలో కిరాణ షాపు నడిపిస్తోంది. షాపులోకి అవసరమైన సామాను కొనుగోలు చేసేందుకు సోమవారం తన కొడుకులు నరేశ్(35), సురేశ్ (25)తో కలిసి సొంత ఆటోలో భువనగిరికి వచ్చారు.
సామాను కొనుగోలు చేసిన అనంతరం తిరిగి గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వడపర్తి సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన డీసీఎం ఆటోను ఢీకొట్టగా.. ఇదే సమయంలో వెనుక నుంచి మరో వాహనం తగిలింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కావడంతో నరేశ్, సురేశ్ అక్కడికక్కడే చనిపోగా, కేతమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకొని కేతమ్మను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్, సీఐ చంద్రబాబు పరిశీలించారు. ఆటోను ఢీకొట్టిన వెహికల్ డ్రైవర్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
