కొంచెం తేడా ఉన్నా.. నో సర్!..ఇంటిపేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్‌‌‌‌ చేయని యాప్

కొంచెం తేడా ఉన్నా.. నో సర్!..ఇంటిపేరు, తండ్రి పేరు, వయస్సు తేడాలుంటే యాక్సెప్ట్‌‌‌‌ చేయని యాప్
  •   కరెక్షన్స్​ చేసేందుకు సంబంధిత కార్డులు, పత్రాలు దగ్గర పెట్టుకోవాలంటున్న బీఎల్‌‌‌‌వోలు
  •     డబుల్​ ఓట్ల విషయంలో ఇక్కడ ఓటు కావాలంటే.. అక్కడ అన్​మ్యాపింగ్​ చేసుకోవాల్సిందే
  •     ఎన్యూమరేషన్ ఫాంలు నింపడంలో తిప్పలు..చాలామంది బీఎల్‌‌‌‌వోలకూ అవగాహన లేక ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న స్పెషల్​ ఇంటెన్సివ్​ రివిజన్​ (సర్​-) ప్రక్రియ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌‌‌‌ఓలు) ప్రతి ఇంటికీ వెళ్లి మాన్యువల్‌‌‌‌గా సేకరించిన ఎన్యూమరేషన్ డేటాను, జీఐఎస్ కో-ఆర్డినేట్స్‌‌‌‌తో సహా ‘బీఎల్ఓ యాప్’లో డిజిటలైజ్ చేయాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియలో 2002 నాటి పాత ఓటర్ల బేస్ డేటాతో ప్రస్తుత రికార్డులను ‘మ్యాపింగ్’ చేయడం, సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు రాకపోవడంలాంటి సాంకేతిక లోపాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆధార్​, ఇతర వివరాల్లో ఉన్న పేర్లు, ఇంటి పేర్లు, పుట్టిన తేదీలు ఓటరు డేటాతో మ్యాచ్​ కాకపోతే యాక్సెప్ట్​ చేయడం లేదు. ఇదిగాక రాష్ట్రంలో ఇప్పటికే  89 లక్షలకుపైగా ఓటర్ల డేటాలో తప్పులు ఉన్నట్టు వాటిని అననామస్​ ఓటర్లుగా ఈసీ గుర్తించింది. సోమవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 1.73 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. రెండు రోజుల్లో మిగతా మొత్తం పూర్తి చేయనున్నారు. 


ఓటర్ల వివరాల్లో చిన్న తేడా ఉన్నా యాప్​ దరఖాస్తులను తిరస్కరిస్తోంది. ఓటరు ఇంటిపేరు, తండ్రి పేరు, వయస్సు లేదా పుట్టిన తేదీలో స్వల్ప మార్పులున్నా అందుకు తగిన సరైన డాక్యుమెంట్​ఇవ్వనప్పుడు యాప్ ఆమోదించడం లేదు. గతంలో మాన్యువల్‌‌‌‌గా ఫారాలు నింపి స్థానిక అధికారుల సమక్షంలో సరిచేసే అవకాశం ఉండేది.. కానీ ఇప్పుడు యాప్ ఆధారిత ప్రక్రియ కావడంతో డిజిటల్ వ్యవస్థ ఏ మాత్రం తప్పులున్నా స్వీకరించడం లేదు. ఆధార్ కార్డులో ఒకలా, పాత ఓటర్ కార్డులో మరోలా పేర్లు ఉండటం ఇప్పుడు క్షేత్రస్థాయిలో పెద్ద ఇబ్బందిగా మారింది. యాప్ డిజైన్ చేసిన విధానం ప్రకారం ప్రతి ఒక్క అక్షరం, డేటా కచ్చితంగా మ్యాచ్ అయితేనే తదుపరి విభాగానికి వెళ్తుంది. లేదంటే ప్రక్రియ అక్కడికక్కడే నిలిచిపోతుండటంతో వేలాది మంది దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో పడిపోతున్నాయి.

ఈ సాంకేతిక చిక్కుల నుంచి బయటపడి కరెక్షన్స్ విజయవంతంగా పూర్తి చేయాలంటే సంబంధిత పక్కా పత్రాలు దగ్గర పెట్టుకోవాలని బీఎల్ఓలు స్పష్టం చేస్తున్నారు. కేవలం నోటిమాటగా లేదా పాత సమాచారంతో మార్పులు చేయడం సాధ్యం కాదని, ఓటరు ఐడెంటిటీని నిరూపించే బలమైన ఆధారాలను యాప్‌‌‌‌లో లైవ్‌‌‌‌గా అప్‌‌‌‌లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఓటర్లు తమ వెంట ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్, పాస్‌‌‌‌పోర్ట్ లేదా ప్రభుత్వం జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలని, ఏ ఒక్క ఆధారంలో తప్పులున్నా, దాన్ని సరిచేసిన తర్వాతే ఓటరు జాబితా సవరణకు రావాలని సూచిస్తున్నారు.

బర్త్​ డే, పేర్ల తప్పులే 16 లక్షలకుపైగా..

ఇప్పటికే మొత్తం 89 లక్షలకుపైగా ఓటరు రికార్డుల్లో  తప్పులు ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఇవి కాకుండా ధ్రువీకరణ కోసం ఇచ్చే పత్రాల్లో ఉన్నవాటికి ఓటరు కార్డుకు సరిపోలకపోయినా యాప్ యాక్సెప్ట్ చేయడం లేదు.  89 లక్షల ఓటర్లలో అత్యధికంగా 41,52,434 రికార్డుల్లో ఫొటో గుర్తింపు కార్డుల లోపాలు ఉన్నాయి. చాలామంది ఓటర్ల కార్డుల్లో ఫొటోలు మసకగా, నల్లగా ఉండటంతో వాటి స్థానంలో సరికొత్త కలర్ ఫొటోలను అప్‌‌‌‌లోడ్ చేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న సమస్య ఒకే ఇంటి నంబరుపై 10 కంటే ఎక్కువ ఓట్లు ఉండటం. ఈ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 26.14 లక్షల ఓట్లు నమోదై ఉండటంతో బీఎల్ఓలు క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతున్నారు. వీటితోపాటు రికార్డుల్లో వయస్సు, పేర్లు, ఇంటిపేర్లు, తండ్రి లేదా భర్త పేర్లు పూర్తిగా తప్పుగా పడి వ్యత్యాసాలున్న ఓటర్లు 16 లక్షల మంది ఉన్నట్టు గుర్తించారు. 

డబుల్ ఓటర్లకు ‘అన్​మ్యాపింగ్’ కఠినం 

ఎవరైనా ఒకే వ్యక్తికి రెండు నియోజకవర్గాల్లో లేదా రెండు వేర్వేరు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే, వారు ఎక్కడో ఒకచోట మాత్రమే ఓటు ఉంచుకోవాలి. ఒకవేళ కొత్త ప్రాంతంలో ఓటు కావాలనుకుంటే, పాత నియోజకవర్గంలో కచ్చితంగా ‘అన్-మ్యాపింగ్’ (ఓటు రద్దు) చేసుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పాత ఓటు డిలీట్ అయినట్టు లేదా అన్-మ్యాప్ అయినట్టు సిస్టమ్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్ అయితేనే, కొత్త యాప్ ఇక్కడి ఓటును అంగీకరిస్తుంది. చాలామంది హైదరాబాద్‌‌‌‌లోనూ, అటు సొంత గ్రామాల్లోనూ ఓట్లను అలాగే ఉంచుకున్నారు. ఇప్పుడు యాప్ ద్వారా డూప్లికేషన్ డేటాను ఈజీగా పట్టుకుంటుండటంతో, ఎక్కడో ఒకచోట రద్దు చేసుకోవడం తప్పనిసరి అయింది. ఈ అన్-మ్యాపింగ్ ప్రక్రియ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో త్వరగా అప్‌‌‌‌డేట్ కాకపోవడంతో ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అవగాహన లేకపోతే వివరాలు రాయడం కష్టమే

మరోవైపు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్​ ఫారంలు నింపడం కూడా అంత ఈజీగా సాగడం లేదు. చదువుకున్న వాళ్లు సైతం ఎక్కడ ఏ వివరాలు నింపాలనే దానిపై కన్ఫ్యూజ్​ అవుతున్నారు. ఇక చాలామంది బీఎల్ఓలకూ ఈ కొత్త యాప్, టెక్నాలజీపై కనీస అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. తగినంత శిక్షణ లేకుండానే అధికారులను ఫీల్డ్ వెరిఫికేషన్‌‌‌‌కు పంపడంతో, యాప్‌‌‌‌లో వచ్చే ఎర్రర్లను ఎలా పరిష్కరించాలో తెలియక వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు రాకపోవడం, డేటా సింక్ కాకపోవడంలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో..పేర్లలో, డేట్​ ఆఫ్​ బర్త్​ ఇతర తప్పులు ఉన్నోళ్లు జులై 31న విడుదల చేసే డ్రాఫ్ట్ రోల్ (ముసాయిదా జాబితా) విడుదలైన తర్వాత సరిచేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. 

ఆగస్టు 1 –30 వరకు ఓటర్లు తమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద నిర్వహించే ప్రత్యేక క్యాంపుల్లో బీఎల్ఓలకు నేరుగా ఫామ్-8 ఇచ్చి, బీఎల్‌‌‌‌ఓ యాప్​ ద్వారా లైవ్‌‌‌‌గా డాక్యుమెంట్లు స్కాన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. క్లెయిమ్‌‌‌‌లు, అభ్యంతరాలను స్వీకరించి, అన్ని సాంకేతిక లోపాలను సరిదిద్దిన తర్వాత అక్టోబర్ 1 నాటికి పూర్తిస్థాయి స్వచ్ఛమైన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.