- నెల రోజుల పాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సెంటర్లు ఓపెన్
- ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అదనపు డ్యూటీలతో అంగన్‌వాడీ టీచర్లు పడుతున్న ఇబ్బందులు, బీఎల్వో డ్యూటీలతో కొన్ని చోట్ల సెంటర్లు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరి సమస్యలపై ‘వెలుగు’ పత్రికలో ‘అదనపు డ్యూటీలతో అంగన్వాడీలు ఉక్కిరిబిక్కిరి’ అనే పేరుతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది.
ఒకే సమయంలో అంగన్ వాడీ సెంటర్ల నిర్వహణ, బీఎల్వో విధులు, పల్స్ పోలియో నిర్వహించలేక టీచర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అంగన్‌వాడీ టీచర్ల పనివేళల్లో మార్పులు చేస్తూ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శ్రుతి ఓఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ కోసం అంగన్ వాడీ టీచర్లను బూత్ లెవల్ ఆఫీసర్లుగా నియమించారు. దీంతో కొన్ని చోట్ల అంగన్‌వాడీ సెంటర్లను మూసివేయడం, మరికొన్ని చోట్ల కొన్ని గంటలు మాత్రమే నిర్వహించడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలపై ప్రభావం పడుతున్నది. దీనిపై స్పందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ, అంగన్ వాడీ సేవలు ఆగకుండా టీచర్లపై భారం పడకుండా నిర్ణయం తీసుకుంది.
నెల రోజులపాటు కొత్త టైమింగ్స్..
సాధారణంగా అంగన్‌వాడీ సెంటర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఉదయం గంట లేటు.. సాయంత్రం గంట ముందు సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైతే అంగన్ వాడీ టీచర్లు.. బీఎల్వో విధులు నిర్వహిస్తున్నారో ఆ సెంటర్లు జూన్ 29 నుంచి జూలై 28 వరకు నెల రోజులపాటు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి.
చిన్నారుల భద్రత, పౌష్టికాహార పంపిణీకి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా చిన్నపిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ సమయ వేళలు మార్చినట్లు మెమోలో పేర్కొన్నారు. జిల్లా సంక్షేమశాఖ అధికారులు తమ పరిధిలోని సెంటర్లలో ఈ ఆదేశాలను అమలు చేయాలని డైరెక్టర్ సూచించారు. ఈ నిర్ణయంతో అంగన్ వాడీ టీచర్లకు కొంత ఉపశమనం లభించింది.
