మల్టీ విటమిన్ రైస్ ను ప్రోత్సహిస్తం.. ప్రపంచ బియ్యం ఎగుమతిదారుగా తెలంగాణను తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్

మల్టీ విటమిన్ రైస్ ను ప్రోత్సహిస్తం.. ప్రపంచ బియ్యం ఎగుమతిదారుగా తెలంగాణను తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మల్టీ విటమిన్ రైస్, ఫోర్టిఫైడ్ రైస్ వంటి విలువ ఆధారిత బియ్యం ఉత్పత్తులకు ప్రోత్సహిస్తామని సివిల్​ సప్లయీస్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బియ్యానికి విలువ జోడించడం ద్వారా రైతులతో పాటు రైస్ మిల్లర్ల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచ బియ్యం ఎగుమతి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నదని వెల్లడించారు.

 సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి దేశీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో  డిమాండ్​ ఉందన్నారు. 

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయడం వరకే పరిమితమవుతున్నదని, ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మంత్రి చెప్పారు. నాణ్యత పాటిస్తూ బియ్యం ఎగుమతులు చేపట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

విదేశీ మార్కెట్లను టార్గెట్​ చేయాలి

మల్టీ విటమిన్ రైస్ వంటి వినూత్న ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ప్రపంచ మార్కెట్లలో మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకునే అవకాశముందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. దేశీయ, విదేశీ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని రైస్ పరిశ్రమ ముందుకు సాగాలని సూచించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా రైతులకు అధిక ధర లభించడంతో పాటు రైస్ మిల్లర్లకు రెట్టింపు లాభాలు వస్తాయన్నారు. 

రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 81 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి చెప్పారు. రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే రూ.19,303 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. వానాకాలం, యాసంగి రెండు సీజన్లు కలిపి రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 300 లక్షల టన్నులు దాటిందని, రాష్ట్ర అవసరం కేవలం 36 లక్షల  టన్నులు మాత్రమే ఉండడంతో తెలంగాణ మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు.