రోడ్లపై ఎస్టీపీ నీళ్లు.. సంస్థకు లక్ష ఫైన్... జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ లోని ‘లిథోప్‌‌‌‌‌‌‌‌’ కు వాటర్ బోర్డు షాక్..

రోడ్లపై ఎస్టీపీ నీళ్లు.. సంస్థకు లక్ష ఫైన్... జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ లోని ‘లిథోప్‌‌‌‌‌‌‌‌’ కు వాటర్ బోర్డు షాక్..

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రైవేట్​ఎస్టీపీలలో శుద్ధి చేసిన నీటిని మెయిన్​రోడ్డుపై వదిలేస్తున్న వారిపై వాటర్​బోర్డు కన్నెర్ర చేసింది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపైకి నీటిని వదిలిన ఒక వాణిజ్య సంస్థకు అధికారులు భారీ జరిమానా విధించారు. సిటీలో ఈ నెల 26న వాటర్ బోర్డు అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్​ 82, నవనిర్మాణ్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ‘లిథోప్’ అనే సంస్థ ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని బయటకు వదలడాన్ని అధికారులు గుర్తించారు. 

ఈ నీరు రోడ్డుపైకి చేరడంతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా, పరిసరాల్లో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించినందుకు గానూ సదరు యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేసి,  లక్ష జరిమానా విధించారు. 

ఈ డబ్బులను మూడ్రోజుల్లో కట్టకపోతే అదనపు జరిమానా విధిస్తామని , తాగునీరు, మురుగునీటి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఎస్టీపీలు నిర్వహిస్తున్న వారంతా శుద్ధి చేసిన నీటిని మొక్కలకు పట్టడం లేదా ఇతర అవసరాలకు పునర్వినియోగించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. అలా కాకుండా రోడ్లపైకి లేదా ఇతర అనధికారిక ప్రాంతాల్లోకి వదిలేస్తే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.