ఫీజు సాకుతో సర్టిఫికెట్లు ఆపితే కఠిన చర్యలు..ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష వార్నింగ్

ఫీజు సాకుతో సర్టిఫికెట్లు ఆపితే కఠిన చర్యలు..ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను ఫీజు కట్టలేదనే సాకుతో ఆపితే.. ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినయ్ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫ్రీ కార్పొరేట్ ఇంటర్ అడ్మిషన్ల స్కీమ్ కింద ఉచిత విద్య అందిస్తుండగా, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు బకాయిల పేరుతో పేరెంట్స్‌ను వేధించడంపై పలు ఫిర్యాదులు రావడంతో సోమవారం ఆమె తీవ్రంగా స్పందించారు. 

సర్కారు నుంచి డబ్బులు రావాల్సి ఉందనే నెపంతో విద్యార్థులు ఫీజులు కట్టాల్సిందేనని బలవంతం చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఆడుకోవద్దని మేనేజ్‌మెంట్లకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎప్ సెట్, దోస్త్  సహా పలు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్నందున, సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థులు ఉన్నత చదువుల అవకాశాలు కోల్పోతారని సెక్రటరీ సీరియస్ అయ్యారు. ఫీజుల అంశం సర్కారుకు, మేనేజ్‌మెంట్లకు మధ్య ఉన్న సమస్య అని, దానిని విద్యార్థులకు ముడిపెట్టి ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు.