నైజీరియన్ డ్రగ్స్ రాకెట్‌‌కు ఈగల్ ఫోర్స్ చెక్... బెంగళూరులో నిందితుడు అరెస్ట్

నైజీరియన్ డ్రగ్స్ రాకెట్‌‌కు ఈగల్ ఫోర్స్ చెక్... బెంగళూరులో నిందితుడు అరెస్ట్
  • 241 గ్రాముల డ్రగ్స్, మూడు ఫోన్లు సీజ్

హైదరాబాద్‌‌, వెలుగు: కర్నాటక బెంగళూరు కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌‌కు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ చెక్ పెట్టింది. ఆదివారం బెంగళూరులోని దొమ్మసంద్ర-బెల్తూర్‌‌లో జరిపిన ఆపరేషన్‌‌లో నైజీరియన్‌‌ పెడ్లర్‌‌‌‌ మైఖేల్‌‌ జాన్సన్ నెట్‌‌వర్క్‌‌లోని అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ రాహుల్‌‌ను అరెస్ట్ చేసింది. నిందితుడి నుంచి రూ. లక్షల విలువైన 241 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌‌, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. 

నైజీరియాకు చెందిన మైఖేల్ జాన్సన్ అనే డ్రగ్స్ వ్యాపారి..అక్కడి నుంచే ఫోన్ ద్వారా బెంగళూరులో తన నెట్‌‌వర్క్‌‌ను నడిపిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఈ ముఠా పోలీసులకు దొరకకుండా ‘డెడ్‌‌డ్రాప్(సరుకు మార్పిడి)’ పద్ధతిలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమర్లు వాట్సాప్ ద్వారా డబ్బులు ఆన్‌‌లైన్‌‌లో చెల్లించిన తర్వాత, నైజీరియా నుంచి మైఖేల్ ఇచ్చే సూచనల మేరకు రాహుల్ జనసంచారం లేని ప్రాంతాల్లో డ్రగ్స్ దాచిపెట్టేవాడు. 

ఆ తర్వాత ఆ స్పాట్ ఫొటోలను, లొకేషన్‌‌ను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు షేర్ చేసేవాడు. జూన్ 10న శంషాబాద్ సమీపంలో మోహిత్ కుమార్ అనే పెడ్లర్ పట్టుబడటంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది. మోహిత్ ఇచ్చిన సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు రాహుల్‌‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇప్పటికే హైదరాబాద్‌‌లోని గచ్చిబౌలి, షాద్‌‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని 
అధికారులు పేర్కొన్నారు.