ఇక దేశవ్యాప్తంగా ఒకే రకమైన అంబులెన్స్ సేవలు..కొత్త గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా

ఇక దేశవ్యాప్తంగా ఒకే రకమైన అంబులెన్స్ సేవలు..కొత్త గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా
  •     ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కు అనుగుణంగా  అంబులెన్స్‌‌ల తయారీ
  •     దేశవ్యాప్తంగా జీపీఎస్‌‌ ట్రాకింగ్, 112 నంబర్​తో అనుసంధానం

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో అత్యవసర వైద్య సేవలను వేగంగా అమలు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను ఒకే ప్రమాణాలతో నిర్వహించేందుకు తొలిసారిగా ఒక సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా ‘జాతీయ అంబులెన్స్ సేవ (ఎన్ఏఎస్)–2026’ గైడ్‌‌లైన్స్‌‌ తీసుకువచ్చింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని తెచ్చినట్లు కేంద్ర మంత్రి  స్పష్టం చేశారు.

కొత్త గైడ్‌‌లైన్స్‌‌లో  ఏముందంటే..

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు అందేలా అంబులెన్స్‌‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇందుకోసం జీపీఎస్ ఆధారిత అంబులెన్స్ ట్రాకింగ్, డిజిటల్ కాల్ మేనేజ్‌‌మెంట్, రియల్ టైమ్ పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయనున్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల అంబులెన్స్ సేవలను ఒకే ఏకీకృత అత్యవసర హెల్ప్‌‌లైన్ నంబర్ '112'తో పూర్తిగా అనుసంధానం చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది. 

జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సాంకేతికత ఆధారంగా దేశంలోని ఆసుపత్రులు, రిఫరల్ కేంద్రాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, అంబులెన్స్ స్టేషన్ల మ్యాపింగ్ చేపడతారు. దీనివల్ల ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని అంబులెన్స్ ద్వారా రోగిని వేగంగా తగిన ఆసుపత్రికి తరలించే వీలు కలుగుతుంది. దేశంలోని అన్ని అంబులెన్స్‌‌లు ఇకపై తప్పనిసరిగా ‘ఏఐఎస్–125(ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ )’ అనే ప్రమాణాలకు అనుగుణంగానే ఉండాలి. 

వాహనాల్లో ఉండాల్సిన అవసరమైన వైద్య పరికరాలు, మందుల లభ్యత, వాహనాల క్రమబద్ధమైన నిర్వహణ, నాణ్యత నియంత్రణ, పనితీరు పర్యవేక్షణ మరియు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ అత్యవసర సేవలన్నింటినీ నిరంతరం పర్యవేక్షించడానికి, వాటి మధ్య సరైన సమన్వయం కోసం ప్రతిచోటా 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ డిస్పాచ్ సెంటర్లు (ఐసీడీసీ)ఏర్పాటు చేయాలని జగత్ ప్రకాశ్ నడ్డా రాష్ట్రాలకు సూచించారు.