బిల్డింగ్‌‌ పైనుంచి తోసి బిడ్డను చంపిన తల్లి..హైదరాబాద్‌‌ మల్కాజిగిరిలో దారుణం

బిల్డింగ్‌‌ పైనుంచి తోసి బిడ్డను చంపిన తల్లి..హైదరాబాద్‌‌ మల్కాజిగిరిలో దారుణం

మల్కాజిగిరి, వెలుగు : ఓ మహిళ ఏడేండ్ల కూతురిని బిల్డింగ్‌‌ పైనుంచి తోసి హత్య చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌‌లోని మల్కాజిగిరిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్కాజిగిరి పరిధి వసంతపురి కాలనీ రోడ్ నంబర్‌‌ 13లోని గురుకృప అపార్ట్‌‌మెంట్‌‌లో రెడపాక మోనాలిసా, డేవిడ్‌‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కుమార్తె షరోన్‌‌ మేరి (7) ఉంది.

 మంగళవారం మధ్యాహ్నం మోనాలిసా తన కూతురు షరోన్‌‌ మేరీని మూడో అంతస్తు నుంచి కిందకు తోసేసింది. గమనించిన స్థానికులు చిన్నారిని సమీపంలోని హాస్పిటల్‌‌కు తీసుకెళ్లగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. 

సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కాగా, బాలిక తల్లి మతి స్థిమితం లేక కూతురిని చంపేసిందా.. లేదంటే కుటుంబ కలహాలు కారణమా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.