గ్రీన్‌‌‌‌ ఫీల్డ్ హైవే పక్కనే.. సెమీ బుల్లెట్ ట్రైన్!..ఫ్యూచర్ సిటీ–అమరావతి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వే లైన్

గ్రీన్‌‌‌‌ ఫీల్డ్ హైవే పక్కనే.. సెమీ బుల్లెట్ ట్రైన్!..ఫ్యూచర్ సిటీ–అమరావతి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వే లైన్
  • ప్రాథమిక అలైన్​మెంట్‌‌ను రెడీ చేసి సీఎంకు పంపిన రైల్వేశాఖ
  • 3 నుంచి 3.30 గంటల్లోపే చెన్నైకి జర్నీ..  
  • ఏపీ రాజధాని అమరావతికి గంటన్నరలోపే ప్రయాణం
  • పాత రూట్ రద్దు.. మిర్యాలగూడ మీదుగా ఫైనల్

హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌‌‌‌ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. అమరావతి మీదుగా చెన్నై వరకు ఈ మహా ప్రణాళికను అమలు చేయనున్నారు. రైల్వే నెట్‌‌‌‌వర్క్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి కేవలం 3 నుంచి 3.30 గంటల్లోనే చెన్నైకి చేరుకోవచ్చు.

అమరావతికి కేవలం గంటన్నర లోపే వెళ్లవచ్చు. ఈ కారిడార్ నిర్మాణానికి సుమారు రూ.1.86 లక్షల కోట్లు ఖర్చవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాబోయే ఐదేళ్లలోపు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి పట్టాలెక్కించేలా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హైవేతో పాటే రైలు మార్గాన్ని వేస్తే భూసేకరణ సులువవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు రైల్వే బోర్డు సూత్రప్రాయంగా అంగీకరించింది.

రాష్ట్ర సూచనతో మారిన రూట్

ఈ హైస్పీడ్ కారిడార్ అలైన్‌‌‌‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనతో ప్రాజెక్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. తొలుత ఈ హైస్పీడ్ రైలు కోసం రైల్వే శాఖ హైదరాబాద్–శంషాబాద్– నార్కట్‌‌‌‌పల్లి–సూర్యాపేట-– ఖమ్మం మీదుగా ఏపీలోని అమరావతిని కలుపుతూ చెన్నైకి అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను ప్రతిపాదించింది. అయితే, ఈ రూట్‌‌‌‌కు బదులుగా కొత్తగా నిర్మించే గ్రీన్‌‌‌‌ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే పక్క నుంచే రైల్వే లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో రైల్వే శాఖ, పాత రూట్‌‌‌‌ను పక్కనపెట్టి కొత్త అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌కు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మిర్యాలగూడ మీదుగా సాగే కొత్త మార్గంలో ప్రాథమిక సర్వే పూర్తి చేసి, అలైన్‌‌‌‌మెంట్ డ్రాఫ్ట్‌‌‌‌ను రైల్వే బోర్డు సిద్ధం చేయడం గమనార్హం.

రెండు రాజధానులకు ‘సూపర్’ లింక్

ఈ రైల్వే లైన్ పూర్తయితే తెలంగాణ, ఏపీ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుంది. ప్రస్తుతం రైలులో ఇక్కడి నుంచి విజయవాడ వెళ్లాలంటేనే ఐదు గంటలు పడుతున్నది. ఒకే కారిడార్‌‌‌‌లో రోడ్డు, రైలు మార్గాలు ఉండటం వల్ల లాజిస్టిక్స్ ఖర్చు భారీగా తగ్గుతుంది. అలాగే ఈ కారిడార్‌‌‌‌ను నేరుగా చెన్నై వరకు పొడిగించడం ద్వారా మూడు గంటల్లో చెన్నై ప్రయాణం సాధ్యపడనుంది. గంటకు 250 కిలోమీటర్ల పైచిలుకు వేగంతో దూసుకుపోయే సెమీ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని ఇక్కడ వినియోగిస్తారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే, ఏయే గ్రామాల మీదుగా అలైన్‌‌‌‌మెంట్ వెళ్తుందనే కచ్చితమైన వివరాలతో త్వరలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

బెంగళూరు రూట్.. వయా శ్రీశైలం కష్టమే!

హైదరాబాద్ - చెన్నై మార్గంతో పాటే, హైదరాబాద్ - బెంగళూరు రూట్‌‌‌‌కు సంబంధించి కూడా హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. దీనికోసం తొలుత హైదరాబాద్ -శంషాబాద్ - మహబూబ్‌‌‌‌నగర్ -వనపర్తి రోడ్ నుంచి ఏపీలోని కర్నూలు -డోన్-గుత్తి మీదుగా బెంగళూరుకు అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ను రైల్వే శాఖ ప్రతిపాదించింది. అయితే, ప్రయాణ సమయం మరింత తగ్గించేందుకు ఈ హైస్పీడ్ కారిడార్‌‌‌‌కు అత్యంత దగ్గరి మార్గం (షార్టెస్ట్ రూట్) కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

నల్లమల అటవీ ప్రాంతం గుండా శ్రీశైలానికి ఎలివేటెడ్ కారిడార్‌‌‌‌తో నేషనల్ హైవే రానున్నందున, ఈ హైస్పీడ్ రైలు కారిడార్‌‌‌‌ను సైతం శ్రీశైలం మీదుగా చేపట్టాలని రాష్ట్ర సర్కారు సూచించింది. కానీ, ఈ ప్రతిపాదనపై క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం చేసిన రైల్వే శాఖ పెదవి విరిచింది. దట్టమైన అటవీ ప్రాంతం, కృష్ణానది క్యాచ్‌‌‌‌మెంట్ ఏరియా మీదుగా ఈ భారీ నిర్మాణం చేపట్టడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నదని రైల్వే అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.