హరియాణా మంత్రి సందీప్ సింగ్ పై ఎఫ్ఐఆర్

హరియాణా మంత్రి సందీప్ సింగ్ పై ఎఫ్ఐఆర్

హరియాణా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొన్ని రోజుల క్రితం మంత్రి సందీప్ సింగ్ లైంగిక వేధింపుల‌కు పాల్పడుతున్నట్లు ఆ రాష్ట్రానికి చెందిన జూనియ‌ర్ అథ్లెటిక్స్ కోచ్ ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై చండీగఢ్ పోలీసులు సందీప్ సింగ్ పై  ఐపీసీ 354, 354ఏ, 354బీ, 342, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సందీప్ సింగ్ తనకు ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లో మెసేజ్‌లు పంపేవాడని జూనియర్ కోచ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి  సందీప్ సింగ్ ఇప్పటికే ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని, ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయం చేస్తున్నాయని అన్నారు. కావాలంటే వ్యక్తిగ‌త విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరారు.

మొదటిసారి మంత్రి తనకు ఓ జిమ్ వద్ద పరిచమయ్యాడని ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ లు చేసినట్టుగా సదరు మహిళా కోచ్ ఆరోపించింది. ఒకరోజు ఆఫీస్ కు రమ్మని పిలిచి అసభ్యంగా ప్రవర్తించి వేధించాడని... ఆ క్రమంలో తాను అతన్ని పక్కకు నెట్టెసి అక్కడి నుండి బయటపడ్డానని ఆరోపణలు చేసింది. 

మంత్రి సందీప్ సింగ్ భారత జాతీయ హాకీ జట్టు మాజీ కెప్టెన్. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ నుంచి హర్యానాలోని పెహోవా నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత హర్యానా మంత్రివర్గంలో క్రీడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.