ఇయ్యాల ఢిల్లీలో టీజేఎస్ మౌన దీక్ష

ఇయ్యాల ఢిల్లీలో టీజేఎస్ మౌన దీక్ష

న్యూఢిల్లీ, వెలుగు : విభజన హామీలు, జల వనరుల దోపిడీపై టీజేఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మౌన దీక్ష చేయనున్నారు. మంగళవారం కానిస్టిట్యూషనల్ క్లబ్ లో కేసీఆర్ పాలనపై సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలపై టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. నీళ్ల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, ఇతర అంశాలపై 150 మందితో గంట పాటు మౌన దీక్ష చేయనున్నట్లు ఆయన తెలిపారు. సెమినార్ లో యోగేంద్ర యాదవ్ తో పాటు వివిధ రాష్ట్రాల కీలక నేతలు పాల్గొని కేసీఆర్ పాలనతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు.

ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ వచ్చాక కూడా నీళ్ల వాటాలో అన్యాయం జరుగుతోంది. కృష్ణా జలాల్లో 22% వాటా మాత్రమే తెలంగాణకు దక్కింది. ఈ వాటాతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం సాధ్యం కాదు. వాటికి నీటి కేటాయింపులు లేకపోవడంతో అనుమతులు రావట్లేదు. దీంతో 28 లక్షల ఎకరాలకు నీళ్లు అందట్లేదదు” అని కోదండరాం చెప్పారు.