చిన్నారికి గాంధీ డాక్టర్ల అరుదైన సర్జరీ

చిన్నారికి గాంధీ డాక్టర్ల అరుదైన సర్జరీ

పద్మారావునగర్, వెలుగు :  చిన్నారికి అరుదైన, క్లిష్టమైన సర్జరీని గాంధీ ఆస్పత్రి పీడియాట్రిక్​డాక్టర్ల టీమ్ విజయవంతంగా నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా బైరామల్​గూడ కు చెందిన బాలిక మైథిలి(8) రెండేండ్లుగా విపరీతమైన దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోడానికి  ఇబ్బంది పడుతుంది. చికిత్స కోసం బాలిక తల్లిదండ్రులు సిటీలోని పలు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేకపోగా చివరికి  గత నెలలో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్​ చేయించారు.  సిటీ స్కాన్​, ఎంఆర్ఐలతో పాటు డయాగ్నోస్టిక్​ చేసిన డాక్టర్లు  బ్రోంకోజెనిక్​ సిస్ట్​తో బాలిక బాధపడుతున్నట్లు గుర్తించారు.  

అసహజ రీతిలో విండ్​పైప్, గుండె రక్త నాళాల మధ్య ప్రమాదకరంగా పెరిగిన కణితిని తొలగించేందుకు  డాక్టర్లు ఒక చాలెంజ్ గా తీసుకుని సర్జరీని నిర్ణయించారు. పలు రకాల మెడికల్ టెస్ట్ లు చేసిన తర్వాత గత నెల 29న పీడియాట్రిక్​ సర్జరీ హెచ్ వోడీ ప్రొ.డా. కె.నాగార్జున ఆధ్వర్యంలో డాక్టర్ల టీమ్ బాలికకు ఎలాంటి కోత లేకుండా థోరాకాస్​ స్కోపిక్​ఎక్సేషన్​ను ఉపయోగించి, రెండు గంటలు శ్రమించి, విండ్ పైప్, గుండె రక్తనాళాలు దెబ్బతినకుండా బ్రోంకోజెనిక్​ సిస్ట్​ సర్జరీని సక్సెస్ చేశారు. క్లిష్టమైన సర్జరీని చేసి, కణితిని తొలగించిన  పీడియాట్రిక్​ సర్జరీ హెచ్​వోడీ

డా.కె.నాగార్జున, డాక్టర్లు ఎస్​.శ్రీనివాస్​, మనోజ్,అశ్రిత్​రెడ్డి, హర్ష, నేహ,ప్రగ్న్యాతో పాటు అనెస్థీషియా ప్రొఫెసర్​డా.ఆవుల మురళి, డా.పద్మావతి, డా.రవినాయక్, వైద్య సిబ్బందికి ఆస్పత్రి సూపరింటెండెంట్​ప్రొ.రాజారావు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుందని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు తెలిపారు.