
గండిపేట, వెలుగు: బంగారం నగలను హోమ్ డెలివరీ తీసుకొని, ఆ తర్వాత నిల్ బ్యాలెన్స్, క్లోజ్డ్ బ్యాంక్ అకౌంట్ చెక్కులతో షాపు యాజమానులను బురిడీ కొట్టించిన ఓ కేటుగాడిని రాజేంద్రనగర్ ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.84 లక్షల నగలు, డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గండిపేటకు చెందిన గుంటి సుమన్(43) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అందులో లాభాలు రాకపోవడంతో మోసాలు చేయడమే వృత్తిగా ఎంచుకున్నాడు.
గూగుల్ నుంచి ప్రముఖ జ్యువెలరీ షాపుల కాంటాక్ట్ నంబర్లు తీసుకొని, వారికి లేటెస్ట్ డిజైన్ల నగల ఫొటోలను వాట్సాప్ చేసి హోమ్ డెలివరీ తేవాలని కోరేవాడు. డెలివరీ తీసుకున్నాక నిల్ బ్యాలెన్స్, క్లోజ్డ్ బ్యాంక్ అకౌంట్ చెక్కులను అందించేవాడు. ఆపై ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి షాపు యజమానులను బురిడీ కొట్టించాడు.
ఇలా లింగంపల్లిలోని సాయ సీతా జ్యువెలరీ, శ్రీ సాయి జ్యువెలరీ, శ్రీ సత్యనారాయణ జ్యువెలరీ, పంజాగుట్టలోని సి.వి.గోల్డ్ అండ్ డైమండ్స్ , చార్మినార్‌లోని శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ, బంజారాహిల్స్‌లోని తిబరుమల్ జ్యువెలరీలో మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఆయా ఠాణాల్లో కేసులు నమోదు కాగా, సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.