- వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ విన్నింగ్ టీమ్స్‌కు సన్మానం
ముంబై: టీ20 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియాను బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక (నమన్) లో ఘనంగా సన్మానించనున్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో ఇటీవల ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఐదు జట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో 2025 వన్డే వరల్డ్ కప్ గెలిచిన విమెన్స్ టీమ్, ఐసీసీ చాంపియన్ మెన్స్ టీమ్, 2026 అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టు, 2025 విమెన్స్ అండర్–19 టీ20 వరల్డ్ కప్ జట్లు ఉన్నాయి.
ఇలా ఐదు జట్లకు ఒకే వేదికపై సన్మానం చేయడం ఇదే తొలిసారి అని బోర్డు శనివారం ప్రకటించింది. మరోవైపు లెజెండరీ ప్లేయర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్‌కు బోర్డు అత్యున్నత పురస్కారం ‘కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును బోర్డు ప్రదానం చేయనుంది. విమెన్స్ కేటగిరీలో ఈ అవార్డుకు మిథాలీ రాజ్ ఎంపికైంది.
]
ఇటీవల ప్రకటించిన వ్యక్తిగత పురస్కారాలను కూడా క్రికెటర్లకు అందజేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. 2024–25 సీజన్‌లో అత్యుత్తమంగా రాణించిన టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్మృతి మంధానాకు ఉత్తమ ఇంటర్నేషనల్ క్రికెటర్ (పాలి ఉమ్రిగర్) అవార్డును అందుకోనున్నారు.
