- ఖర్గ్ ఐలాండ్లోని 90కిపైగా మిలిటరీ టార్గెట్లపై అమెరికా బాంబుల వర్షం
- ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడమే టార్గెట్
- హార్మూజ్ లో షిప్పులను అడ్డుకుంటే ఆయిల్ నిల్వలనూ పేల్చేస్తామని వార్నింగ్
- ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం ఖర్గ్ నుంచే
- పశ్చిమాసియాకు మరో 2,500 మంది సోల్జర్లతో యుద్ధనౌక
జెరూసలెం/వాషింగ్టన్: ఇరాన్ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన ఖర్గ్ ఐలాండ్ పై అమెరికా దళాలు శుక్రవారం రాత్రి బాంబుల వర్షం కురిపించాయి. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐలాండ్ లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేశాయి. ఐలాండ్‌లో పెద్ద ఎత్తున ఉన్న చమురు కేంద్రాలు ధ్వంసం కాకుండా కేవలం సైనిక స్థావరాలపై మాత్రమే దాడులు చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) శనివారం ప్రకటించింది. ఐలాండ్లోని మొత్తం 90కిపైగా మిలిటరీ టార్గెట్లను ధ్వంసం చేశామని వెల్లడించింది. ఈ దాడులకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో క్షిపణులు ఐలాండ్‌పై పడుతుండటం, భారీగా పొగలు కమ్ముకోవడం లాంటి దృశ్యాలు కనిపించాయి. అక్కడ ఉన్న ఎయిర్ డిఫెన్స్ యూనిట్, నౌకాదళం, ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ టవర్, హెలికాప్టర్ హ్యాంగర్లు, నౌకాదళ మైన్ నిల్వ కేంద్రాలు, క్షిపణి నిల్వ బంకర్లపై భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించిన నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టులా ఉన్న ఖర్గ్ ఐలాండ్ పై అటాక్ చేయడం ద్వారా పైచేయి సాధించాలన్న లక్ష్యంతో అమెరికా ఈ దాడులు చేపట్టింది.
ప్రస్తుతానికి ఖర్గ్ ఐలాండ్ లోని సైనిక లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేశామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. హార్మూజ్ లో షిప్పులను అడ్డుకోవడాన్ని ఇరాన్ కొనసాగిస్తే.. ఖర్గ్ ఐలాండ్ లోని చమురు కేంద్రాలనూ పేల్చేస్తామని హెచ్చరించారు. మరోవైపు జపాన్ నుంచి 2,500 మంది మెరైన్ సైనికులతో కూడిన 'యూఎస్ఎస్ ట్రిపోలి' యుద్ధనౌకను పశ్చిమాసియాకు తరలించేందుకు అమెరికా రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇది ఇప్పటికే తైవాన్ సమీపంలో ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి.
కొనసాగిన చమురు ఎగుమతులు
అమెరికా దాడులు జరిగిన కొన్ని గంటలకే ఖర్గ్ ద్వీపం నుంచి రెండు ట్యాంకర్లు చమురును లోడ్ చేసుకుంటున్నట్లు 'ట్యాంకర్ ట్రాకర్స్' సంస్థ గుర్తించింది. దాడులు జరిగినప్పటికీ చమురు మౌలిక సదుపాయాలకు నష్టం జరగలేదని తెలుస్తోందని పేర్కొంది. ఇరాన్ ప్రతిరోజూ ఎగుమతి చేసే 1.7 మిలియన్ బారెళ్ల ముడి చమురులో 1.55 మిలియన్ బారెళ్లు ఖర్గ్ ద్వీపం నుంచే వెళ్తాయి. ఇక్కడ సుమారు 30 మిలియన్ బారెళ్ల నిల్వ సామర్థ్యం ఉంది. అయితే, ఇరాన్ నుంచి ఖర్గ్ ద్వారా వెళ్లే చమురులో ఎక్కువ భాగం చైనాకే చేరుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల సరఫరాలో అంతరాయం కలగడంతో, చైనా తన వద్ద ఉన్న నిల్వలను కాపాడుకోవడానికి శుద్ధి చేసిన ఇంధన ఎగుమతులపై నిషేధం విధించింది.
ఇరాన్‌పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా వివిధ ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. గత 24 గంటల్లోనే ఇరాన్‌లో 200 క్షిపణి లాంచర్లు, ఆయుధ కేంద్రాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 15,000 శత్రు లక్ష్యాలను పేల్చివేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదో వంతు వాటా ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మూతపడకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
లెబనాన్‌పైనా అటాక్స్
లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ విమాన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 26 మంది పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్సులను హిజ్బుల్లా సైనిక అవసరాల కోసం వాడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుండగా, అది కేవలం దాడులను సమర్థించుకోవడానికేనని లెబనాన్ ఆరోగ్య శాఖ మండిపడింది. లెబనాన్ లో ఇప్పటివరకు ఇక్కడ 800 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. హిజ్బుల్లాను పూర్తిగా అణిచివేసే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.
ఏంటీ ఖర్గ్ ఐలాండ్..
పర్షియన్ గల్ఫ్‌లోని చమురు నిల్వలను ప్రపంచానికి చేరవేసే అతిముఖ్యమైన కేంద్రం ‘ఖర్గ్ ఐలాండ్’. కేవలం 20 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న సహజసిద్ధమైన ఈ పగడపు ద్వీపం, ఇరాన్ దేశానికి ఆర్థిక నిధి వంటిది. ‘బుషెహర్’ తీరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. దీని పొడవు కేవలం 8 కి.మి., వెడల్పు 4 కి.మి. మాత్రమే. కానీ, వ్యూహాత్మక స్థానం కావడం దీనిని ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఒకటిగా మార్చింది.
చమురు ఎగుమతుల్లో 90% ఇక్కడ్నుంచే..
ఇరాన్ ఆదాయం ప్రధానంగా ముడి చమురు ఎగుమతులపై ఆధారపడి ఉంటుంది. ఆ ఎగుమతులకు ఖర్గ్ ఐలాండ్ ప్రధాన కేంద్రం కావడమే దీనిని 'ఆర్థిక గుండెకాయ'గా మార్చింది. అందుకు గల ప్రధాన కారణాలు ఇవే.. ఇరాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ముడి చమురులో దాదాపు ‘90%’ ఈ ఒక్క ద్వీపం నుంచే సరఫరా అవుతుంది. ఈ ద్వీపం చుట్టూ సముద్రం చాలా లోతుగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ట్యాంకర్లు కూడా సులభంగా తీరానికి వచ్చి చమురును నింపుకోవడానికి వీలుంటుంది.
చారిత్రక, భౌగోళిక ప్రత్యేకత
ఈ ద్వీపం కేవలం చమురుకే పరిమితం కాదు. ఇది పురాతన కాలం నుంచి ఒక ముఖ్యమైన వర్తక కేంద్రంగా ఉండేది. ఇక్కడ పగడపు శిలలు ఎక్కువగా ఉండటం వల్ల దీనికి సహజమైన రక్షణ ఉంటుంది. 1960వ దశకం నుంచి ఇరాన్ దీనిని తన ప్రధాన చమురు ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేస్తూ వస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరాన్ దేశపు ఆర్థిక వ్యవస్థ నిలబడాలన్నా, ఆ దేశ ఖజానాకు విదేశీ మారక ద్రవ్యం రావాలన్నా ఖర్గ్ ఐలాండ్ నుంచి చమురు రవాణా నిరంతరం సాగాల్సిందే. అందుకే దీనిని ఆ దేశపు ‘లైఫ్ లైన్’ ‘ఆర్థిక గుండెకాయ’ అని పిలుస్తారు.
