వెలుగు ఓపెన్ పేజ్: వంటగ్యాస్ సంక్షోభం.. ఎల్పీజీ గ్యాస్ ఆదా ఇలా!

వెలుగు ఓపెన్ పేజ్: వంటగ్యాస్ సంక్షోభం.. ఎల్పీజీ  గ్యాస్ ఆదా ఇలా!

కూరగాయలు, మాంసం వంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలను చిన్నచిన్న ముక్కలుగా చేసి వండాలి. అందువలన ఆహార పదార్థాలు త్వరగా ఉడికి గ్యాస్ ఆదా అవుతుంది.  ఎందుకంటే సైన్స్ ప్రకారం చిన్న పరిమాణంలో  ఉన్న  ఆహార పదార్థాలు త్వరగా ఉడుకుతాయి.  

    నీటి ఆవిరితో  వంటకాలు త్వరగా ఉడికి గ్యాస్ ను ఆదా చేస్తాయి. ఉదాహరణకు  ప్రెషర్ కుక్కర్లో  ఒకేసారి  ఎక్కువ మొత్తంలో,  వివిధ రకాలైన ఆహార పదార్థాలను త్వరగా వండవచ్చును. సాధారణంగా నీరు మరిగే ఉష్ణోగ్రత  100 డిగ్రీలC కంటే గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.  నీటి ఆవిరి ఉష్ణోగ్రత ఎక్కువగా  ఉండటం,   నీటి ఆవిరి,  ఆహార పదార్థాలలోకి చొచ్చుకొని పోవడం వలన ఆహార పదార్థాలు త్వరగా ఉడుకుతాయి.  బియ్యం, పప్పులు, బీన్స్,  నాన్​వెజ్  వంటి ఆహార పదార్థాలు ప్రెషర్ కుక్కర్​లో  చాలావేగంగా ఉడుకుతాయి.  ప్రెషర్  కుక్కర్  వంట గ్యాస్ వినియోగాన్ని 30 నుంచి 50 శాతం వరకు ఆదా చేస్తుంది.  

    నీటి ఆవిరితో  వంటకాలు చేస్తున్నపుడు  నీళ్లు  మరిగే వరకు ఎక్కువ లేదా  మీడియం  మంటతో వంట చేయాలి.  ఉదాహరణకు ప్రెషర్ కుక్కర్​లో  మొదటి విజిల్ తర్వాత  మంటను  తక్కువ చేయాలి  లేదా  సిమ్ మంట మీద ఉంచాలి. అందువలన గ్యాస్ ఆదా  అవుతుంది.  వృథా కాదు.

    మంట,  వంటపాత్ర  సైజుకు సరిపడా ఉండాలి.  మంట,  వంటపాత్ర  సైజు కన్నా  ఎక్కువ ఉంటే  20–25%  గ్యాస్ వృథా  అవుతుంది. గ్యాస్  నీలిరంగులో మండేటట్లు చూసుకోవాలి.  పసుపుపచ్చ  లేదా ఆరెంజ్ రంగంలో గ్యాస్ మండినట్లయితే  గ్యాస్  అసంపూర్ణంగా మండుతున్నట్లుగా భావించాలి.  అందువలన గ్యాస్ వృథా అవుతుంది. 

    వంటపాత్రలు,  ప్రెషర్ కుక్కర్ గోడలపై  స్కేలింగ్(తెల్లటి పొర) ఏర్పడకుండా ఎల్లపుడు శుభ్రంచేస్తూ ఉండాలి.  స్కేలింగ్  మంట వేడిని  గ్రహించటం వలన  ఆహార పదార్థాలకు వేడి అందదు. గ్యాస్ వృథా అవుతుంది.  

    వంట చేస్తున్నపుడు  వంటపాత్రకు లేదా గిన్నెకు  మూతపెట్టడం వలన  వంట వేగవంతం అవుతుంది, గ్యాస్ ఆదా అవుతుంది. వంటకు  ముందు బీన్స్,  బియ్యం, శనగలు,  కందిపప్పు మొదలగువాటిని  నానబెట్టడం వలన  అవి 
మెత్తబడతాయి. వంట వేగవంతం అవుతుంది, తద్వారా ఇంధనం  ఆదా అవుతుంది.

    పొట్టుతో కూడిన ఆహార పదార్థాలను వండాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది,  ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. కానీ, పొట్టులేని ఆహార పదార్థాలు  త్వరగా ఉడుకుతాయి. గ్యాస్  తక్కువగా  ఖర్చు అవుతుంది. పొట్టుతో కూడిన ఆహార పదార్థాలకు,  పొట్టులేని  ఆహార  పదార్థాలతో  పోలిస్తే  కొంతమేర  ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. 

త్వరగా ఉడికే  కూరగాయలను,  ఆహార పదార్థాలను  వండుకోవాలి. ఉదాహరణకు ఆకు కూరలు, బీరకాయలు, ఆలుగడ్డ మొదలగునవి. దోసెలు, చపాతీలు వంటివి కాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తయారు అయ్యే ఇడ్లి,  ఉప్మా వంటి వాటిని  తీసుకోవటం వలన గ్యాస్ ఆదా అవుతుంది. 

    ప్రస్తుత గ్యాస్  సంక్షోభ సమయంలో అందరూ కలిసి వంట చేసుకోవడం, లేదా సామూహిక వంటశాలలను వినియోగించుకోవడం వంటివి కూడా ఉపయోగపడతాయి.

    స్టవ్‌‌‌‌‌‌‌‌లు,   స్టవ్  బర్నర్ల నిర్వహణ.. గ్యాస్​ ఆదా చేయడానికి  స్టవ్ బర్నర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దుమ్ము,  ఆహార పదార్థాలు స్టవ్ బర్నర్  రంధ్రాలను మూసివేయటం వలన  అసమాన మంటలతో ఇంధనం ఎక్కువ వినియోగం అవుతుంది. శుభ్రమైన బర్నర్  స్థిరమైన  నీలిరంగు  మంటతో  మండుతుంది. 

     గ్రామాలలో  వ్యవసాయం ఉన్న ప్రాంతాలలో  గోబర్ గ్యాస్  ప్లాంట్లు  ద్వారా వంట  చేసుకోవచ్చును.  గోబర్ గ్యాస్ ప్లాంటు  పర్యావరణ అనుకూలమైనది. ఇది మిథేన్  వాయువును ఉత్పత్తి చేస్తుంది. 

విద్యుత్​తో పనిచేసే ఇండక్షన్ స్టవ్​లు, ఎలక్ట్రిక్  కెటిల్‌‌‌‌‌‌‌‌లు, కరెంటు పొయ్యిలు  గ్యాస్​కు బదులుగా  అత్యంత ప్రజాదరణ పొందినవి.  ముఖ్యంగా టీ  తయారుచేయడం,  మరిగే నీరు  లేదా సాధారణ భోజనం వండటం వంటి శీఘ్ర పనులకు  ఇవి ఉపయోగపడతాయి.  సౌర 
కుక్కర్లు,  సూర్యరశ్మి  సహాయంతో  ఎటువంటి  గ్యాస్  అవసరం  లేకుండా ఆహారాన్ని వండడానికి ఎండ ఉన్న ప్రాంతాలలో ఇవి 
ఉపయోగపడతాయి.

సిలిండర్లో ఎంత గ్యాస్ ఉన్నది గుర్తించాలంటే... మొదట  సిలిండర్​ను ఆఫ్  చేయండి.  స్టవ్ వాడకుండా వాల్వ్ మూసేయండి.  సిలిండర్  చల్లగా ఉండాలి.   సిలిండర్ వేడిగా అనిపిస్తే  కాసేపు వేచి ఉండండి.  గోరు వెచ్చని నీటిని (మరిగే నీటిని వాడకండి)  సిలిండర్​కు ఒక వైపు పైనుంచి  కిందికి పోయండి.  కొన్ని సెకండ్ల  తరువాత  గోరువెచ్చని నీరు పోసిన  వైపు  చేతితో తాకి చూడండి. చల్లగా అనిపించే భాగం  నుంచి కింద వరకు గ్యాస్ ఉంది అని అర్థం.  

గ్యాస్ లేని భాగం వెచ్చగా లేదా సాధారణ ఉష్ణోగ్రతలో అనిపిస్తుంది. ఇది  గ్యాస్ ఉన్న  పరిమాణాన్ని  తెలియచేస్తుంది.  ప్రస్తుత గ్యాస్  సంక్షోభ సమయంలో  బ్లాక్ మార్కెట్  సిలిండర్లు లేదా అసురక్షిత ఇంధన ప్రత్యామ్నాయాల వైపు ఎక్కువగా  మొగ్గు చూపకూడదు. ఎందుకంటే.. ఈ పద్ధతులు  ప్రమాదకరమైనవి.   లీకేజీలు లేదా పేలుళ్లకు  ఇది దారితీయవచ్చు.  ప్రస్తుత  వంటగ్యాస్ సంక్షోభం తాత్కాలికమే.  ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వలన వంటకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్  దొరకటం ప్రస్తుతం ప్రజలకు  కష్టతరమవుతున్నది. భారతదేశంలో ఎల్పీజీ అనేది ప్రొపేన్ వాయువు, బ్యూటేన్ వాయువుల మిశ్రమం.  
వంట  చేసుకొనే  విధానాలను  మార్చుకోవటం, కొన్ని జాగ్రత్తలను  తీసుకోవటం ద్వారా ఎల్పీజీ గ్యాస్​ను  ఆదా చేసుకోవచ్చును.  

-డా.శ్రీధరాల రాము
ఫ్యాకల్టీ ఆఫ్  కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్


Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.