
ఈ రోజుల్లో ఎవర్నీ నమ్మాలో ఎవర్నీ నమ్మకూడదో అర్థం కావట్లేదు..రోజూ ఒకే చోట పనిచేస్తున్నా..ఒకే ఏరియాలే ఉంటున్నాం కదా? అని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే నమ్మితే నట్టేట ముంచుతున్నారు. తెలిసిన వాళ్లే కదా?. మనవాళ్లేకదా అని నమ్మి పైసాపైసా కష్టపడి దాచుకున్న సొమ్మును ఆశపడి పెట్టుబడి పెడితే జంప్ జిలానీ అంటున్నారు. ప్రశ్నిస్తే ఎదురు దాడి చేస్తున్నారు.
లేటెస్ట్ గా తెలంగాణలోని పటాన్ చెరులో ఇలాంటి ఘటనే జరిగింది. ఏపీకి చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఓ మహిళ పలువురి నుంచి రూ. 18 కోట్లు కాజేసింది. తీరా ప్రశ్నిస్తే బాధితులపై ఎదురుదాడి చేసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఏపీఆర్ గ్రాండియాలో ఉంటున్న విద్య అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు రూ., 18 కోట్లు చీటింగ్ చేసింది. ఏపీలోని ఓ ఎమ్మెల్యే , ఆయన పీఏ నుంచి రూ. 2వేల కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనాలని పలువురి మహిళల నుంచి డబ్బులు వసూలు చేసింది. కొంతమంది దగ్గర బంగారం తీసుకునీ ఎక్కువ బంగారం ఇస్తానని నమ్మించింది. సికింద్రాబాద్ వారాసిగూడలో బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న ఆ మహిళ తర్వాత పటాన్ చెరుకి మకాం మార్చింది.
మోసపోయామని గ్రహించిన బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే .. అక్టోబర్ 9న ఇస్తానని చెప్పింది అందర్నీ ఒకే చోటకు రప్పించింది. తీరా వచ్చాక. అందరినీ గదిలో పెట్టి రాడ్లతో దాడి చేయించింది. దీంతో ఓ బాధితురాలికి తీవ్రగాయాలవ్వగా స్థానిక ఆస్పత్రికి తరలించారు.అనంతరం బాధితులు పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గతంలో కూడా దాడి చేసినపుడు ఫిర్యాదు చేస్తే పటాన్ చెరుపోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.