సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. ఐవీఎఫ్ పద్దతిలో మహిళ బిడ్డకు జన్మనిచ్చేలా చేశారు. అల్వాల్ కు చెందిన శృతి అనే మహిళ ఐవీఎఫ్ పద్దతిలో ఆడ బిడ్డకు జన్మించింది. ప్రభుత్వ వైద్యంలో ఐవీఎఫ్ బేబీకి జన్మనివ్వడం ఇదే మొదటి సారి. తల్లీబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు.
ఫిబ్రవరి 7న వైద్యులు డెలివరీ చేశారు. ప్రైవేట్ లో 10 నుంచి-15 లక్షలు ఖర్చయ్యే ట్రీట్మెంట్ ను గాంధీలో వైద్యులు ఉచితంగా చేశారు. ఫిబ్రవరి 25న ఈరోజు పేషంట్ డిశ్చార్జ్ అయ్యింది. ఐవీఎఫ్ ఫస్ట్ బేబీ సాకారం చేసిన గాంధీ వైద్యులను డీఎంఈ డా.నరేంద్ర కుమార్ అభినందించారు. గాంధీతో పాటు పెట్ల బూర్జు, వరంగల్, ఆదిలాబాద్ రిమ్స్ లో IVF సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు కావాలనే కోరికతో ఎంతో మంది లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినా కొంత మందికే ఆ మాతృత్వం దక్కుతుంది. లక్షల విలువైన ట్రీట్ మెంట్ కు భయపడి చాలా మంది సంతానం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అలాంటి వారికి గాంధీ ఆస్పత్రిలో ప్రభుత్వ ఐవీఎఫ్ అనేది ఒక వరం అని చెప్పవచ్చు. ఎందుకంటే బయట లక్షల విలువైన వైద్యాన్ని గాంధీలో ఫ్రీగా చేయడం గమనార్హం.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలో తొలిసారి ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) సేవలు అక్టోబర్ 15, 2024న అందుబాటులోకి వచ్చాయి. గాంధీ హాస్పిటల్ ఎంసీహెచ్ బిల్డింగ్‌లోని ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్‌లో ఈ కృత్రిమ గర్భధారణ సేవలను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించిన సంగతి తెలిసిందే..
