ప్రాణం తీసిన మాంజా.. బైక్‎పై వెళ్తుండగా మెడకు తగిలి యువకుడు మృతి

ప్రాణం తీసిన మాంజా.. బైక్‎పై వెళ్తుండగా మెడకు తగిలి యువకుడు మృతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: మాంజా మెడకు తగిలి ఓ వలస కూలీ మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‎కు చెందిన అవదీప్ కుమార్(38) వరి నాట్లు వేయడం కోసం కొద్ది  రోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాడి గ్రామానికి వచ్చాడు. కూరగాయలు కొనేందుకు బుధవారం మధ్యాహ్నం బైక్​పైన ఫసల్వాడి నుంచి సంగారెడ్డికి వెళ్తుండగా.. ఫసల్వాడి స్కూల్ వద్ద రోడ్డుకు అడ్డంగా మాంజా ఉంది. 

అవదీప్ కుమార్ దానిని గమనించకుండా వెళ్లడంతో మెడకు బలంగా కోసుకుంది. దీంతో తీవ్ర గాయమై కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అవదీప్ కుమార్ మృతి చెందాడు. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి ప్రమాదం జరిగిన  స్పాట్‎కు వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన మాంజా చైనాది కాదని, మామూలు మాంజా అని ఎస్ఐ స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న గాలిపటాల విక్రయ దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

=======================================================================