
- మర్మాంగాలను కొరికేసిన ఆనవాళ్లు
- కుక్క నోటికి రక్తపు మరకలు
- గుండెపోటుతో చనిపోగా, యజమానిని లేపడానికే అలా చేసిందన్న అనుమానాలు
- పోస్ట్‌మార్టం రిపోర్టులోనే అసలు
- నిజం తెలుస్తదంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని మధురానగర్ ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు గుండెపోటుతో చనిపోయాడని అనుకుంటుండగా, అతడి మర్మాంగాలను అతడి పెంపుడు కుక్క కరిచిన ఆనవాళ్లు కనిపించాయి. అయితే, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అసలు నిజం బయటపడుతుందని పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకెళితే.. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పవన్ కుమార్ (35) నగరంలోని ఓ జ్యువెల్లరీ షాప్‌లో క్యాషియర్ గా పనిచేస్తూ మధురానగర్ ఈ బ్లాక్ లో ఉంటున్నాడు. ఇతడు సైబీరియన్ హస్కీ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నాడు. భార్యతో మనస్పర్థలు రాగా, ఐదేండ్ల కిందట విడాకులు తీసుకున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పవన్ స్నేహితుడు సందీప్ ఇంటికి వచ్చాడు.
ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగు పొరుగు వారిని పిలిచి తలుపులను పగులగొట్టాడు. లోపలకు వెళ్లి చూడగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. పవన్మర్మాంగాల వద్ద కుక్క కొరికిన ఆనవాళ్లు కనిపించాయి. పక్కనే ఉన్న కుక్క నోటికి రక్తపు మరకలు కనిపించాయి. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు. అనారోగ్యంతో ఉన్న పవన్.. గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని, ఎంతకీ పవన్ లేవకపోవడంతో యజమానిని మేల్కొల్పేందుకు పెంపుడు కుక్క అతడి మర్మాంగాల్ని కొరికి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే గానీ ఏమీ చెప్పలేమని ఎస్సై శివ శంకర్ తెలిపారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.