ఈ–కేవైసీ లేకుంటే  సబ్సిడీ కట్..అక్టోబర్‌ 1 నుంచి ఎల్పీజీ బుకింగ్‌పై ఆంక్షలు

ఈ–కేవైసీ లేకుంటే  సబ్సిడీ కట్..అక్టోబర్‌ 1 నుంచి ఎల్పీజీ బుకింగ్‌పై ఆంక్షలు
  • గ్యాస్‌ సబ్సిడీకి  ఆధార్‌ బయోమెట్రిక్‌ తప్పనిసరి
  • కేవైసీ పూర్తి చేస్తేనే నియంత్రిత ధరకు సిలిండర్‌
  • లేదంటే మార్కెట్‌ రేటుకు కొనాల్సిందే
  • తెలంగాణలో 12 లక్షల  మందికి బీఏఏ పెండింగ్‌

 హైదరాబాద్‌, వెలుగు:  ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం షాక్​ ఇచ్చింది. ఆధార్‌ బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ (బీఏఏ), ఈ–-కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు సబ్సిడీ ధరకు గ్యాస్‌ రీఫిల్‌ పొందడంపై ఆంక్షలు విధించింది. అక్టోబర్‌ 1, 2026 నుంచి సబ్సిడీ వర్తించే రిటైల్‌ సెల్లింగ్‌ ప్రైస్‌ తో ఎల్పీజీ గ్యాస్​ సిలిండర్​ పొందాలంటే బయోమెట్రిక్‌ ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 19 నాటికి దేశంలో మొత్తం 27.43 కోట్ల యాక్టివ్‌ ఎల్పీజీ కనెక్షన్లలో 89.9 శాతం మంది ఇప్పటికే బయోమెట్రిక్‌  పూర్తి చేశారు.

దాదాపు 3.16 కోట్ల మంది బీఏఏ పూర్తి చేయాల్సి ఉందని కేంద్రం గుర్తించింది. ఇక రాష్ట్రంలో 1.30 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు ఉండగా, అథెంటికేషన్​పెండింగ్‌లో ఉన్న వారు దాదాపు 12 లక్షల వరకు ఉంటారనీ గ్యాస్‌ డీలర్ల వర్గాలు  చెబుతున్నాయి. వీరిలో చాలామంది సెప్టెంబర్‌ చివరి వీక్​లో అథెంటికేషన్‌ పూర్తి చేసే చాన్స్ ఉంది. ఇక విదేశాల్లో ఉన్న వినియోగదారులు, ఆధార్‌తో మొబైల్‌ అనుసంధానం లేకపోవడం, వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం లేని  వర్గాలకు  ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాంటి వారు సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీని సంప్రదించి ఈ--కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది.

డూప్లికేట్‌ కనెక్షన్లు అరికట్టేందుకే..

బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పెండింగ్‌లో ఉన్న వినియోగదారుల ఎల్పీజీ రీఫిల్లను నిలిపివేయాలని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు కేంద్రం ఆదేశించింది. ఈ--కేవైసీ పూర్తిచేసిన తర్వాతే సబ్సిడీ ధరకు రీఫిల్‌ అందుతుందని, గ్యాస్‌ కనెక్షన్‌ శాశ్వతంగా రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. బీఏఏ పూర్తి చేయని వారికి డీబీటీ, టార్గెటెడ్‌ సబ్సిడీ వంటి ప్రత్యక్ష ప్రయోజనాలను జులై 1, 2026 నుంచే నిలిపివేసినట్లు తెలిపింది. అయితే వారు ఇప్పటివరకు రిటైల్‌ ధరకు రీఫిల్‌ పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై పరోక్ష సబ్సిడీ భారం పడుతుందని గుర్తించింది.  కేంద్రం తాజా నిర్ణయం ఉద్దేశం సబ్సిడీని అర్హులైన వారికే పరిమితం చేయడం, డూప్లికేట్‌, అనర్హుల కనెక్షన్లను గుర్తించడం, సబ్సిడీ ఎల్పీజీని వాణిజ్య అవసరాలకు మళ్లించడాన్ని అరికట్టడమేనని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

సబ్సిడీ వద్దనుకుంటే మార్కెట్‌ ధరకే

బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ చేయించుకోలేని, చేయించుకోవడానికి ఇష్టపడని వినియోగదారులకు ప్రత్యామ్నాయాన్ని కేంద్రం కల్పించింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల వెబ్‌ పోర్టల్స్‌, మొబైల్‌ యాప్స్‌, ఇతర డిజిటల్‌ మార్గాల ద్వారా సబ్సిడీ లేకుండా మార్కెట్‌ నిర్ణయించే ధరకు ఎల్పీజీ రీఫిల్‌ తీసుకుంటామని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. అలా ఎంపిక చేసుకున్న వారికి అందుబాటును బట్టి 5 కేజీలు లేదా 10 కేజీల సిలిండర్లను మార్కెట్‌ ధరకు అందించే విధానం ఉంటుందని వెల్లడించింది.

అందువల్ల బయోమెట్రిక్‌ పూర్తి చేయకపోతే ఇకపై సబ్సిడీ ధరకు14.2 కేజీల గృహ సిలిండర్‌ అందదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రూ.994లకు 14.2కేజీల సిలిండర్​ లభ్యమవుతుతోంది. ఇక అథెంటిఫికేషన్​ లేని వినియోగదారులకు 10 కేజీల సిలిండర్​ కొనడానికి రూ.3,600, రీఫిల్ చేసుకోవడానికి రూ.1,795 చెల్లించాల్సి ఉంటుందని  గ్యాస్​ ఏజెన్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఎక్కడ చేయించుకోవచ్చు?

వినియోగదారులు బీఏఏ కోసం గ్యాస్‌ డెలివరీ సిబ్బంది ద్వారా, సంబంధిత ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌/గ్యాస్‌ ఏజెన్సీ వద్ద, ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌గ్యాస్‌, హెచ్‌పీ గ్యాస్‌ అధికారిక మొబైల్‌ యాప్‌ల ద్వారా అవకాశం కల్పించారు. మొబైల్‌ ద్వారా ప్రక్రియ పూర్తి చేసుకునే వారు సంబంధిత ఆయిల్‌ కంపెనీ అధికారిక యాప్‌లో అందుబాటులో ఉన్న ఆధార్‌ ఆధారిత ఫేస్‌ అథెంటికేషన్‌/ఈ-కేవైసీ ప్రక్రియను అనుసరించవచ్చు. ఫోన్‌లో అవసరమైన ఆధార్‌ ఫేస్‌ ఆథెంటికేషన్‌ సదుపాయం, అనుమతులు ఉండాలి. సాంకేతికంగా ప్రక్రియ పూర్తికాకపోతే సమీప గ్యాస్‌ ఏజెన్సీ,  డెలివరీ సిబ్బంది సహాయంతో బయోమెట్రిక్‌ ధ్రువీకరణ చేయించుకోవచ్చు.