ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు స్పీడప్ : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు స్పీడప్ : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
  • కేంద్రం నుంచి ఇద్దరు నోడల్ అధికారుల నియామకం
  • రాష్ట్రం కూడా ఒకరిని నియమించాలి: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఆదిలాబాద్ ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్, జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్ (జేయూఏ) పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం కోసం కేంద్రంలోని రెండు శాఖల నుంచి నోడల్ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించి వివిధ సంస్థల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

రక్షణ శాఖ ఆధ్వర్యంలో ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, విజిటింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్, డిస్పర్సల్స్, షెల్టర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ఆపరేషనల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. శిక్షణ కార్యక్రమాలు, విమానాల మెయింటెనెన్స్‌కు అవసరమైన మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. పౌర విమానయానానికి సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలో సివిల్ టెర్మినల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

విమానాల మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎంఆర్వో) సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రక్షణ సిబ్బంది కోసం క్వార్టర్స్, క్రీడలు, వినోద సదుపాయాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. నీటి సరఫరా, పారిశుధ్యం వంటి ప్రత్యేక ఇంజినీరింగ్ సదుపాయాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రాజెక్టు పనుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థల మధ్య సమన్వయం కీలకమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నోడల్ అధికారిని నియమించాలని కోరారు. కేంద్రం తరఫున నోడల్ అధికారులను నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.