బుర్ఖాలో ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తడు.. ఆదిత్య థాక్రేపై మంత్రి నితీష్ రాణే సెటైర్

బుర్ఖాలో ఇండియా, పాక్ మ్యాచ్ చూస్తడు.. ఆదిత్య థాక్రేపై మంత్రి నితీష్ రాణే సెటైర్

ముంబై: ఆసియా కప్‎ 2025లో ఇండియా, పాక్ మ్యాచ్‎పై వివాదం నడుస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‎తో క్రికెట్ ఆడొద్దని.. ఆసియా కప్‎లో ఇండియా, పాక్ మ్యాచ్‎ను బైకాట్ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. శివసేన (యూబీటీ) కీలక నేత, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే కూడా ఇదే డిమాండ్ చేశారు. ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలనే బీసీసీఐ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన ఆదిత్య థాక్రే.. బీసీసీఐని జాతి వ్యతిరేకి అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఈ క్రమంలో ఆదిత్య థాక్రే వ్యాఖ్యలపై మంత్రి నితేష్ రాణే రియాక్ట్ అయ్యారు. శనివారం (సెప్టెంబర్ 13) రాణే మీడియాతో మాట్లాడుతూ.. ఇండియా, పాక్ మ్యాచ్ బైకాట్ చేయాలంటున్న ఆదిత్య థాక్రే బురఖాలో దాక్కుని రహస్యంగా ఆ మ్యాచ్ చూస్తాడని ఎద్దేవా చేశారు. సీక్రెట్‎గా మ్యాచ్ చూడటమే కాకుండా  పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు కూడా చేస్తాడని హాట్ కామెంట్ చేశారు. ఇక.. శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ మెరైన్ డ్రైవ్‌లో ఇండియా, పాక్ మ్యాచ్ బ్లాక్ టిక్కెట్లు అమ్ముతాడని సెటైర్ వేశారు. 

ఆదిత్య థాక్రే ఏమన్నారంటే..?

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలనే బీసీసీఐ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు ఆదిత్య థాక్రే. బీసీసీఐ దేశ వ్యతిరేకిగా మారుతోందని విమర్శించిన ఆదిత్య థాక్రే.. పాక్‎తో మ్యాచ్ ఆడటానికి బీసీసీఐ ఎందుకంతా ఉత్సాహం చూపిస్తోందని ప్రశ్నించారు. డబ్బు, ప్రకటనల ఆదాయం కోసమే పాక్‎తో మ్యాచ్ ఆడుతున్నారని విమర్శించారు. 

ఆసియా కప్ ఇండియాలో జరిగితే మేం ఆడబోమని పాకిస్థాన్ ఖరాకండిగా చెప్పినప్పుడు.. బీసీసీఐ ఎందుకు ఆ మ్యాచ్‎ను బైకాట్ చేయట్లేదని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి జరిగాక.. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధాని మోడీ అన్నారు.. అలాంటప్పుడు యుద్ధం, క్రీడలు ఎలా కలిసిపోతాయని ప్రశ్నించారు.

పహల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్ గాయాలు ఇంకా మానలేదని.. అయినప్పటికీ ఈ ప్రభుత్వం మన దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాపింపజేసే అదే పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీసీసీఐ దేశభక్తిని వ్యాపారంగా మార్చారని.. వాళ్లకి డబ్బే ముఖ్యమని దేశ ప్రజలు ప్రాణాలు, మనోభావాల గురించి అవసరం లేదని విమర్శలు గుప్పించారు.