దయచేసి నా సినిమా చూడండి. బాయ్‌ కాట్‌ చేయొద్దు

దయచేసి నా సినిమా చూడండి. బాయ్‌ కాట్‌ చేయొద్దు

చాలా రోజుల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోన్న అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సినిమాను బైకాట్ చేయాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తన చిత్రాన్ని ఎవరూ బాయ్‌కాట్‌ చేయొద్దని బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమీర్‌ఖాన్‌ అన్నారు. దేశభక్తి విషయంలో అందరూ తనని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని, తాను భారతదేశాన్ని గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. తనపై, తన సినిమాపై ప్రతికూల ప్రచారం జరుగుతున్నందుకు బాధగా ఉందన్న ఆయన... అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తాను దేశాన్ని గౌరవించనని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్లకు చెప్పేది ఒక్కటే.. ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు. తన గురించి అటువంటి ప్రచారాలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి నా సినిమా చూడండి. బాయ్‌ కాట్‌ చేయొద్దు" అని అంటూ ప్రేక్షకులను అమీర్ కోరారు. 

ఇదిలా ఉండగా హాలీవుడ్‌లో సూపర్‌హిట్ అందుకున్న 'ఫారెస్ట్‌ గంప్‌'కు రీమేక్‌గా 'లాల్‌ సింగ్‌ చడ్డా' తెరకెక్కింది. అమీర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నాగచైతన్య కీలకపాత్ర పోషించారు. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో.... ఈ క్రమంలోనే ఆయన సినిమాని బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు నెటిజన్లు.. 'బాయ్‌కాట్‌ లాల్‌సింగ్‌చడ్డా' అని వరుస పోస్టులు పెడుతున్నారు.