ఇస్లామాబాద్: పాక్ గంటకో మాట మారుస్తోంది. ఓ వైపు శాంతి కావాలంటుంది.. మరోవైపు యుద్ధానికి సిద్ధమంటుంది. ఓ వైపు చర్చలకు రావాలంటుంది.. మరో వైపు ఉగ్రవాదులపై దాడి జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకుంటామంటుంది. ఇప్పుడు మళ్లీ ఇంకోసారి మాట మార్చింది పాక్.
ఉదయం ఇద్దరని చెప్పి..
నిన్న పాక్ లోని జైషే ఉగ్ర క్యాంపులను మన వాయుసేన ధ్వంసం చేసి వచ్చింది. దానికి ప్రతిగా భారత పౌరులు, బలగాలను టార్గెట్ చేస్తూ పాక్ దాడికి యత్నించింది. దాన్ని మన ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టింది. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నంలో మన యుద్ధ విమానం ఒకటి పాక్ లో కూలింది.
ఆ యుద్ధ విమానంలో నుంచి ఇద్దరు భారత వాయుసేన పైలట్లను అరెస్టు చేశామని బుధవారం ఉదయం పాక్ ప్రకటించింది. ఓ పైలట్ గాయపడడంతో ఆస్పత్రికి తరలించామని, మరో పైలట్ ను విచారిస్తున్నామని పాక్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మీడియాతో చెప్పారు.
సాయంత్రానికి మాట మారింది

ఉదయం ఇద్దరిని అరెస్టు చేశామని చెప్పిన పాక్ సాయంత్రానికి మాట మార్చేసింది. ఒక్క పైలట్ నే అరెస్టు చేశామని గఫూర్ ట్వీట్ చేశారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ ను పాకిస్థాన్ ఆర్మీ కస్టడీలోకి తీసుకుందని చెప్పారు. ఆయనను మిలటరీ ఎథిక్స్ ప్రకారం ఎలా చూసుకోవాలో దాని ప్రకారమే ట్రీట్ చేస్తామని తెలిపారు.
పాకిస్థాన్ కాదు.. ఫేకిస్థాన్
ఉదయం ఇద్దరు పైలట్లను అరెస్టు చేశామన్న పాక్.. సాయంత్రానికి ఒక్కరే అని చెప్పడంపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొద్ది గంటల్లో మాట మార్చడంపై మండిపడుతున్నారు. అది పాకిస్థాన్ కాదు.. ఫేకిస్థాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఉదయం ఇద్దరని.. చెప్పి ఇప్పుడు ఒక్కరే అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
