- 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా నమోదు
- మూడు జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా రికార్డ్
- నల్గొండ జిల్లాలో అత్యధికంగా 41.6 డిగ్రీలు
- పలు జిల్లాల్లో తేమ శాతం 94గా నమోదు
- 4 రోజులు వడగండ్ల వానలు..
- ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఎండ మంటకి తోడు ఉక్కపోత కూడా జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎండల తీవ్రత అంతగా ఉండదని ఐఎండీ మంత్లీ అవుట్ లుక్ లో వెల్లడించినా.. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల మార్క్ ను దాటేశాయి. శనివారం నల్గొండ జిల్లా మాడ్గులపల్లిలో అత్యధికంగా 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదైతే అందులో 3 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా రికార్డ్ అయ్యింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురంలో 41.3, ఖమ్మం జిల్లా గుబ్బగుర్తిలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 40.6, మంచిర్యాల, నారాయణపేటలో 40.5, కుమ్రం భీం ఆసిఫాబాద్ లో 40.3, సూర్యాపేట 40.2, నిర్మల్ జిల్లాలో 40.1 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఎండలతో పాటు ఉక్కపోత కూడా ఎక్కువైంది. నల్గొండ, యాదాద్రి, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, మంచిర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో ఉక్కపోత తీవ్రంగా ఉంది. ఆయా జిల్లాల్లో గాల్లో తేమ శాతం 94 గా ఉంది.
వడగండ్ల వానలు పడే చాన్స్..
ఎండల ప్రభావం ఉన్నా.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్షాల అలర్ట్ ని ఐఎండీ జారీ చేసింది. తొలి రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను ఇష్యూ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకు దక్షిణ తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, హైదరాబాద్ కు వర్షాల అలర్ట్ లేకపోయినా.. సాయంత్రానికి మబ్బులు పట్టే అవకాశం ఉందని
ఐఎండీ తెలిపింది.
