రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ ద్వారానే టికెట్ చార్జీలు చెల్లిస్తున్నట్లు ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి ఆర్టీసీ యాజమాన్యం చేసిన సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సులు, సిటీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగాయి.
హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు ఆర్టీసీ బస్సు అంటేనే 'చిల్లర' కోసం గొడవలు, నగదు చెల్లింపులు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. లేటెస్ట్ టెక్నాలజీని అందుకున్న ఆర్టీసీ.. ప్రయాణీకులకు నగదు రహిత సేవలను చేరువ చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రతి నలుగురిలో ఒకరు ఆన్‌లైన్ ద్వారానే టికెట్ ఛార్జీలు చెల్లిస్తున్నట్లు ఓ ప్రైవేట్ సంస్థతో కలిసి ఆర్టీసీ యాజమాన్యం చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం.. హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లే లాంగ్ రూట్ బస్సుల్లోనూ, సిటీ బస్సుల్లోనూ ఆన్‌లైన్ పేమెంట్లు భారీగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ సగటున 25 శాతం మంది డిజిటల్ లావాదేవీలనే ఎంచుకుంటున్నారు. చిల్లర సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఆర్టీసీ ప్రవేశపెట్టిన 'టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ (టిమ్స్)' అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి.
అందుబాటులో లాస్ట్ మినిట్ బుకింగ్
బస్సు ప్రయాణీకులు తమ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పేమెంట్ చేస్తున్నారు. టిమ్స్ మెషిన్ల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులను కూడా అధికారులు అనుమతిస్తున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని చోట కూడా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్‌సీఎంసీ కార్డులు) ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించారు. బస్సు బయలుదేరడానికి కేవలం 15 నిమిషాల ముందు వరకు కూడా ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉండడంతో యువత ఆర్టీసీ వైపు మొగ్గు చూపుతున్నారు.
భవిష్యత్తులో విమాన స్థాయి సేవలు!
"చాలా ఏండ్ల తర్వాత ఆర్టీసీలో నగదు రహిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ప్రయాణీకులు సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు" అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ చెల్లింపులు 50 శాతానికి పైగా పెరుగుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం టికెట్లే కాకుండా, విమానాలు, రైళ్లలో ఉండే అత్యాధునిక సౌకర్యాలను ఆర్టీసీ బస్సుల్లో కూడా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.
