రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి 

రాజ్యసభ సభ్యులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి 

 

  • ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్​
  • రాష్ట్ర సమస్యలపై రాజ్యసభలో పోరాడుతా: వేం నరేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. ఆ రెండు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. రాజ్యసభ సభ్యులుగా కాంగ్రెస్​కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి సోమవారం ప్రక టించారు.  మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ఆ రెండు స్థానాలకు ఇద్దరి నామినేషన్లు మినహా మరేవి దాఖలు కాలేదు.

దీంతో  కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా వెల్లడించారు. సాయంత్రం అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ ఇద్దరికి ధృవీకరణ పత్రాలను అందించారు. సింఘ్వీ తరఫున ఆయన సన్నిహితుడు, న్యాయవాది ఢిల్లీ నుంచి వచ్చిన సురేంద్ర చౌహాన్.. రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి నుంచి ధృవీకరణ పత్రం తీసుకోగా, వేం నరేందర్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యతో పాటు అసెంబ్లీ, మండలి కార్యదర్శులు తిరుపతి, నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

తెలంగాణకు రావాల్సిన నిధులు,హక్కులపై పోరాడుతారు: శ్రీధర్ బాబు

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కుల కోసం  సింఘ్వీ, వేం నరేందర్​రెడ్డి కేంద్రంపై పోరాటం చేస్తారని అన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశానని, వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న స్నేహం బలమైందని స్పష్టం చేశారు. తమ స్నేహం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పట్టించుకోనని అన్నారు. రాజ్యసభ సభ్యునిగా తెలంగాణ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కాగా అభిషేక్ మను సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ.2,558 కోట్లు అని పేర్కొన్నారు. వేం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో తనకు రూ. 41.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.