- ఖరారు చేసిన కాంగ్రెస్ హైకమాండ్.. నేడు నామినేషన్
- హాజరుకానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పలువురు మంత్రులు
- నరేందర్ రెడ్డి ఖరారుతో మాట నెగ్గించుకున్న సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది, సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. మెజారిటీ లేకపోవడంతో ఈ ఎన్నికలకు తాము దూరంగా ఉంటామని బీఆర్‌ఎస్ ప్రకటించింది. దీంతో వీరిద్దరి ఏకగ్రీవం లాంఛనం కానున్నది.
రెండు రోజులుగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇటు పీసీసీ నాయకత్వం అటు హైకమాండ్ మధ్య చర్చోపచర్చలు జరిగాయి. మొదటి నుంచి ఒక సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. రాష్ట్రం నుంచి రాజ్యసభకు సిట్టింగ్ మెంబర్‌గా ఉన్న సింఘ్వీకి తిరిగి రెన్యూవల్ కావడం ఖాయమని తేలడంతో రెండో సీటు విషయంలోనే అందరిలో ఉత్కంఠ నెలకొన్నది. ఈ సీటు కోసం రాష్ట్రంలోని 16 మంది పార్టీ సీనియర్లు పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. వివిధ సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ చివరకు వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపింది.
48 గంటలపాటు నాటకీయ పరిణామాలు
వేం నరేందర్‌రెడ్డి పేరు ఖరారుకు ముందు 48 గంటలపాటు పార్టీలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సీటు కోసం వేం నరేందర్‌రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, మాజీ ఎంపీ దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మూడు రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు వికారాబాద్ వచ్చారు.
ఆ సందర్భంలో ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే అభ్యర్థుల ఎంపికపై కేసీ వేణు గోపాల్‌తోపాటు సీఎం, పీసీసీ చీఫ్‌తో చర్చించారు. కొలిక్కి రాకపోవడంతో మరుసటి రోజు ఢిల్లీకి రావాలని సీఎం, పీసీసీ చీఫ్‌ను రాహుల్ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. చివరకు జూమ్‌లోనే కేసీ వేణుగోపాల్‌తో ఈ ఇద్దరు నేతలు మాట్లాడి.. అభ్యర్థిని ఫైనల్చేసినట్లు తెలిసింది.
మంగళవారం రాత్రి వినయ్ కుమార్ పేరు ప్రచారంలోకి రాగా, బుధవారం మధ్యాహ్నం కొత్తగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన దొమ్మాటి సాంబయ్య పేరు తెరపైకి వచ్చింది. చివరకు బుధవారం రాత్రి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను హైకమాండ్ ప్రకటించడంతో కొన్ని రోజులుగా ఇటు కాంగ్రెస్ లో అటు రాష్ట్ర రాజకీయాల్లో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
ఇయ్యాల నామినేషన్లు..
నామినేషన్లకు గురువారం చివరి రోజు. దీంతో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీలోని రాజ్యసభ రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి తరఫున సీఎల్పీ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పీసీసీ లీగల్ టీం పర్యవేక్షణలో నామినేషన్ పేపర్లు రెడీ చేస్తున్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన సంకేతాలతో బుధవారం ఉదయమే అభిషేక్ మను సింఘ్వీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ ఇద్దరి నామినేషన్ల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచే నేరుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికోసం శంషాబాద్ వెళ్లనున్నారు.
మాట నెగ్గించుకున్న సీఎం
వేం నరేందర్‌రెడ్డి పేరు రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి తన మాట నెగ్గించుకున్నట్లయింది. రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడిన క్షణం నుంచి అందరి నోళ్లలో వేం నరేందర్‌రెడ్డి పేరు నానింది. సీఎం రేవంత్ ఈయన విషయంలో సర్వశక్తులు ఒడ్డితే తప్ప ఇది సాధ్యం కాలేదనే చర్చ పీసీసీలో సాగుతున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర సామాజిక వర్గాలకే ఈ స్థానం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సీఎం పట్టుబట్టి హైకమాండ్ వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎట్టకేలకు తన సన్నిహితుడికి రాజ్యసభ సీటును ఖరారు చేయించుకున్నారనే చర్చ కాంగ్రెస్‌లో జోరుగా సాగుతున్నది.
తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభకు సింఘ్వీ..
అభిషేక్ మను సంఘ్వీ..రాజస్థాన్ రాష్ట్రం జోథ్‌పూర్‌లో 1959 ఫిబ్రవరి 24 న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో బీఏ , కేంబ్రిడ్జిలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. కాంగ్రెస్‌లో ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన కేకే రాజీనామా చేయడంతో 2024 ఆగస్టులో ఆయన స్థానంలో తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్రంనుంచి రెండోసారి రాజ్యసభకు నామినేషన్
వేస్తున్నారు.
ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యే.. నేడు పెద్దల సభకు నరేందర్‌రెడ్డి
వేం నరేందర్‌రెడ్డి 1960లో జన్మించారు. బీఏ చదివారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి ఏపీలో 2004 నుంచి 2009 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రేవంత్ పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తర్వాత ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచారు. రేవంత్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి.. ఇటు పార్టీ.. అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంనుంచి పెద్దల సభకు వెళ్తున్నారు.
