తెలంగాణలో కాంగ్రెస్​కు 9 నుంచి 11 ఎంపీ సీట్లు!

తెలంగాణలో కాంగ్రెస్​కు 9 నుంచి 11 ఎంపీ సీట్లు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే లోక్‌‌సభ ఎలక్షన్లలోనూ అదే జోరు చూపించనుందని ఏబీపీ సీఓటర్ సర్వే అంచనా వేసింది. లోక్‌‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 9 నుంచి 11 సీట్లను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలున్నాయని శనివారం వెల్లడించింది. గతంలో 3 స్థానాలను గెలిచిన పార్టీ.. ఇప్పుడు అదనంగా మరో 6 నుంచి 8 సీట్లు ఎక్కువ గెలుస్తుందని స్పష్టం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్‌‌కు గతంతో పోలిస్తే సీట్లలో భారీగా కోత పడే అవకాశమున్నట్టు చెప్పింది. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 సీట్లను గెలుచుకోగా.. ఈసారి 3 నుంచి 5 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. బీజేపీ 1 నుంచి 3 స్థానాలు గెలిచే చాన్స్ ఉన్నట్టు పేర్కొంది. 1 నుంచి 2 సీట్లను ఇతరులు గెలుచుకుంటారని తెలిపింది. 

ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రంలో పోటీ చేస్తే మాత్రం కాంగ్రెస్‌‌కు కొంత దెబ్బ తగిలే అవకాశం ఉందని సీఓటర్ సంస్థ డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌‌ముఖ్ అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే 14కుపైనే సీట్లు గెలుచుకుంటాయని, అందులో 8కిపైగా బీజేపీనే గెలుస్తుందని ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కాగా, గతంతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ గతం కంటే భారీగా పెరుగుతుందని అంచనా వేసింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో 29.8 శాతం ఓట్లు రాగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 38 శాతం ఓట్లు పడతాయని పేర్కొంది.