ప్రపంచ సంపన్నులకు అడ్డాగా పేరుగాంచిన అబుదాబి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలుతోంది. ఇన్నాళ్లూ ఆకాశమే హద్దుగా పెరిగిన ప్రాపర్టీ ధరలు.. ఇప్పుడు అక్కడ నేలచూపులు చూస్తున్నాయి. కేవలం గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయల విలువ కరిగిపోతుండటం ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తోంది. తాజాగా ప్రాపర్టీ రేటు పడిపోవటం చూస్తుంటే అబుదాబి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక పెద్ద క్రాష్ దిశగా వెళ్తోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గంటలో రూ.7 కోట్లు తగ్గిన విల్లా రేటు..
అత్యంత విలాసవంతమైన అల్ జుబైల్ ఐలాండ్‌లోని ఒక 4BR విల్లా ధరలో జరిగిన మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రస్తుతం. 8,395 చదరపు అడుగుల వైశాల్యం గల ఈ ప్రాపర్టీ ధరను ఏకంగా 817,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7 కోట్లు తగ్గింది అది కూడా జస్ట్ ఒక్క గంటలోనే. గడచిన 78 రోజులుగా అమ్మకానికి పెట్టినా ప్రాపర్టీని కొనటానికి.. ఒక్కరు కూడా ముందుకు రాకపోవడంతో, యజమాని గత్యంతరం లేక ధరను 25% తగ్గించాల్సి వచ్చిందట. అంతకుముందు రూ.28 కోట్లుగా ఉన్న ఈ విల్లా విలువ ఇప్పుడు రూ.21 కోట్లకు పడిపోవటం నెట్టింట వైరల్ అవుతోంది.
🚨 Biggest Abu Dhabi price drop we've ever tracked.
— Panic Selling (@panicsellingxyz) March 7, 2026
A 4BR villa on Al Jubail Island just cut $817,000 off its asking price. In one move.
Seef Al Jubail — 8,395 sqft
Was $3.3M (AED 12.1M)
Now $2.5M (AED 9.2M)
📉 -25%. Listed 78 days. No buyer.
And it's not alone.
A 2BR at the… pic.twitter.com/j2xZHuvKgR
లూవర్ అబుదాబి రెసిడెన్సెస్:
కేవలం ఒకే ఒక్క గంట వ్యవధిలో సాదియాత్ ఐలాండ్‌లోని లూవర్ అబుదాబి రెసిడెన్సెస్‌లో ఉన్న 2BR అపార్ట్‌మెంట్ ధర 436,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3కోట్ల 67లక్షలు తగ్గింది. 57 రోజుల పాటు మార్కెట్‌లో అమ్మకానికి ఉన్నా ఎవరూ కొనకపోవడంతో 17.2% మేర ధర తగ్గించాల్సి వచ్చింది యజమానులు. గడిచిన 7 గంటల్లోనే కేవలం ఈ రెండు ప్రాపర్టీల నుండే దాదాపు రూ.10 కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది.
అమ్మకానికి ప్రాపర్టీలు.. కొనేటోళ్లు లేరు:
తాజా లెక్కల ప్రకారం అబుదాబిలోని 3,605 ప్రాపర్టీలను పరిశీలించగా.. కేవలం ఒక్క రోజులోనే 43 ప్రాపర్టీల ధరలు భారీగా తగ్గాయి. సగటున 4.4% మేర ధరలు పడిపోగా.. అత్యధికంగా 25% వరకు రియల్టీ రేట్లు కుప్పకూలాయి. మొత్తం మీద ఒక్క రోజులోనే దాదాపు రూ.33 కోట్లు విలువైన ప్రాపర్టీ విలువ తగ్గినట్లు డేటా చెబుతోంది. యుద్ధం ముదిరేకొద్ది ఈ రియల్టీ పతనం కొనసాగే అవకాశం ఉందని ప్రాపర్టీ ఓనర్లు ఆందోళన చెందుతున్నారు.
భారతీయ ఇన్వెస్టర్లకు హెచ్చరిక..
దుబాయ్, అబుదాబి ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెట్టే భారతీయులకు ఇది ఒక హెచ్చరిక లాంటిదే. కొనేవారు లేకపోవడంతో సప్లై పెరిగిపోయి, డిమాండ్ పడిపోవడం వల్ల అక్కడ తాజా పరిస్థితి తలెత్తింది. ఇన్వెస్టర్లు ఇప్పుడు తమ పెట్టుబడుల భద్రత గురించి పునరాలోచనలో పడ్డారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మధ్యప్రాచ్యంలో రియల్ ఎస్టేట్ బబుల్ పేలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా కూడా పాకే అవకాశం కనిపిస్తోందంటున్నారు వారు.
