- ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ రాంబాబు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న రూ.9,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వస్తే విద్యారంగంలో మార్పులు తెస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు సవితి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. గత బడ్జెట్‌లో కేవలం 7 శాతం నిధులే ఇచ్చిందని, అవి కూడా పూర్తిస్థాయిలో విడుదల చేయలేదన్నారు.
యూనివర్సిటీలకు వాటి అవసరాల మేరకు బ్లాక్ గ్రాంట్ పెంచాలని, అశాస్త్రీయంగా పెంచిన ఇంజనీరింగ్, ఫార్మా ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. యూనివర్సిటీల్లో 70 శాతం టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 2,878 పోస్టులకు గాను 753 మందే పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.
