
ఏబీవీపీ చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తం
స్టూడెంట్ లీడర్లపై పోలీసుల లాఠీచార్జ్
స్టూడెంట్లపై పోలీసుల లాఠీచార్జ్
వీసీల నియామకంపై 24 గంటల్లో సీఎం స్పందించాలి లేకుంటే రేపు కాలేజీల బంద్: ఏబీవీపీ
లాఠీచార్జ్‌కు నిరసనగా నేడు రాష్ర్టవ్యాప్త నిరసనలకు పిలుపు
విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని, యూనివర్సిటీలకు పర్మినెంట్ వీసీలను నియమించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ర్ట కమిటీ బుధవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాగైనా అసెంబ్లీని ముట్టడించాలని ఏబీవీపీ కార్యకర్తలు నిర్ణయించారు. మూడు రూట్లలో అక్కడికి చేరుకోవాలని ప్లాన్చేసుకున్నారు. నిజాంకాలేజీ నుంచి ఒక టీమ్, సెక్రటేరియెట్ రూట్ నుంచి ఇంకో టీమ్, తెలుగు యూనివర్సిటీ రూట్ నుంచి మరో టీమ్.. ఒకేసారి అసెంబ్లీ వైపు దూసుకొచ్చాయి. బస్సులు, ఆటోలు, బైక్‌లతో పాటు మెట్రోలోనూ కొందరు స్టూడెంట్లు అక్కడికి చేరుకున్నారు. ఒక రూట్‌నుంచి స్టూడెంట్లు వస్తున్నారని పోలీసులు అలర్ట్ అయ్యేలోపే, మిగిలిన రెండు రూట్ల నుంచి అసెంబ్లీ ముందుకు చేరుకున్నారు. ఏం జరుగుతున్నదో తెలుసుకునే లోపే, ఏబీవీపీ నేతలు అసెంబ్లీ గేట్లు ఎక్కారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. అసెంబ్లీ గేట్లతోపాటు పబ్లిక్‌గార్డెన్ గేట్లను మూసివేసి, వారిని అడ్డుకున్నారు. దీంతో స్టూడెంట్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితోపాటు పోలీసులు స్టూడెంట్లను లాఠీలతో కొట్టారు. అయినా స్టూడెంట్లు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో అదనపు బలగాలను తెప్పించిన పోలీసులు.. వారందరినీ అక్కడి నుంచి ఈడ్చిపడేశారు. వీసీల నియామకంపై 24 గంటల్లో సీఎం స్పందించాలని, లేకుంటే శుక్రవారం కాలేజీలు బంద్ చేస్తామని ఏబీవీపీ ప్రకటించింది. లాఠీచార్జ్‌కి నిరసనగా గురువారం రాష్ర్టవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
ప్రొటెస్ట్ చేస్తే.. చితకబాదుతారా?: టీజేఎస్
ఏబీవీపీ, పీడీఎస్ యూ నాయకులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని టీజేఎస్ప్రధాన కార్యదర్శి గంగాపురం వెంకట్ రెడ్డి, వీజేఎస్రాష్ర్ట అధ్యక్షుడు నిజ్జన రమేశ్, కార్యదర్శి సర్దార్వినోద్ కుమార్ఖండించారు. నిరసన వ్యక్తం చేస్తే చాతికబాదడం ఏంటని ప్రశ్నించారు. లాఠీచార్జ్ చేసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దాడి సరికాదు: టీపీయూఎస్
ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీపీయూఎస్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్ చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఒక్క సమస్యనూ పరిష్కరించకపోగా, స్టూడెంట్లపై అమానుషంగా దాడిచేయడం సరికాదన్నారు.
ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటం: ఏబీవీపీ
ప్రభుత్వ విద్యను నాశనం చేయాలనుకునే టీఆర్ఎస్ సర్కార్ కుట్రను అడ్డుకుంటామని ఏబీవీపీ రాష్ర్ట కార్యదర్శి అంబాల కిరణ్, సెంట్రల్ కమిటీ మెంబర్ ప్రవీణ్‌కుమార్, సిటీ సెక్రెటరీ శ్రీహరి తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ జీతాలకే సరిపోతాయనీ, వెంటనే మరో 30 శాతం నిధులు ఎడ్యుకేషన్‌కు కేటాయించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల స్టూడెంట్లకు ఉన్నత విద్య అందించే యూనివర్సిటీలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వీసీలు, ప్రొఫెసర్లను నియమించడం లేదని మండిపడ్డారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించిన లక్షా ఏడువేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేయాలని, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమాలను అణచడం మీ తరం కాదు
అసెంబ్లీ ఎదుట స్టూడెంట్లపై పోలీసులు చేసిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థి ఉద్యమాలను అణచివేయడం కేసీఆర్ తరం కాదని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించాలనడం తప్పా? అసెంబ్లీ సాక్షిగా చెప్పిన లక్షా ఏడు వేల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చి కేసీఆర్ తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
– బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి