కేసీఆర్ ఫ్యామిలీని తరిమేద్దాం : యజ్ఞవల్క్య శుక్లా

కేసీఆర్ ఫ్యామిలీని తరిమేద్దాం : యజ్ఞవల్క్య శుక్లా
  • కార్పొరేట్ విద్యాసంస్థలకు అండగా రాష్ట్ర సర్కార్            
  • కదనభేరీ సభలో ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి యజ్ఞవల్క్య శుక్లా
  •  కుటుంబ ప్రగతినే పెంచుకుంటున్న కేసీఆర్: అశీష్ చౌహాన్ 
  •  రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేశారు: ఝాన్సి

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ సర్కారు పూర్తిగా అవినీతితో నిండిపోయిందని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి యజ్ఞవల్క్య శుక్లా ఆరోపించారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత చేతుల్లో బందీ అయిందని విమర్శించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని.. కొద్ది రోజుల్లోనే వారిని తరిమేస్తామని చెప్పారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో తెలంగాణ విద్యార్థి కదన భేరీ పేరుతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) బహిరంగ సభ నిర్వహించింది.

ఈ సభకు ముఖ్య​అతిథిగా యజ్ఞవల్క్య శుక్లా హాజరై మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే నారాయణ, చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలను తెలంగాణ నుంచి తరిమేస్తామన్న కేసీఆర్.. ఇప్పుడు వాటికి అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి లిక్కర్ క్వీన్, కింగ్​లను కేసీఆర్ తయారు చేశారని విమర్శించారు.

జైజై తెలంగాణ.. బైబై కేసీఆర్

అమరుల ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని యజ్ఞవల్క్య అన్నారు. ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని.. జారీ చేసిన కొన్ని నోటిఫికేషన్లకు పేపరు లీకేజీలతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. స్టూడెంట్లు కేసీఆర్​ను రాష్ట్ర పొలిమేర వరకూ తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ప్రశ్నించడం అంటే కేసీఆర్​కు నచ్చదనీ.. ప్రశ్నించే వాళ్లను జైళ్లలో వేస్తున్నారని మండిపడ్డారు. జైజై తెలంగాణ.. బైబై కేసీఆర్ అనే నినాదంతో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.

బడుల్లో టీచర్లే లేరు

కేసీఆర్ పాలనలో విద్యారంగం నిర్వీర్యమైందని ఏబీవీపీ నేషనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆశీష్ చౌహాన్ ఆరోపించారు. రాష్ట్రంలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. టీచర్లు లేక విద్యావ్యవస్థ కుంటుపడిందన్నారు. కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ప్రగతిభవన్​లో కూర్చొని కుటుంబ ప్రగతిని పెంచుకున్నారని చెప్పారు. అధికారం ఇచ్చిన ప్రజలను పక్కన పెట్టి, పక్క రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. నేషనల్ సహా సంఘటన కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ...  కేసీఆర్ తెలంగాణలో బ్రిటీష్ పరంపర కొనసాగిస్తున్నారని చెప్పారు. ఏబీవీపీ చేసిన డిమాండ్లను నెలరోజుల్లో పరిష్కరించకుంటే ప్రగతిభవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ నేషనల్ సెక్రెటరీ అంకిత పవార్ మాట్లాడుతూ... ఇండియా విశ్వగురువుగా మారుతుంటే.. తెలంగాణలో మాత్రం లాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, పేపర్ల లీక్ మాఫియా నడుస్తోందన్నారు. రాష్ట్రంలో బడుల్లో బాలికలకు టాయ్ లెట్లు కూడా లేవన్నారు.

ఖాళీలు వెంటనే భర్తీ చేయాలె

నాడు ఆంధ్రపాలన అంతం కావాలనీ ఓయూలో రణభేరి మోగించామని.. తాజాగా కేసీఆర్ పాలన పోవాలని కదనభేరీ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సి తెలిపారు. కేసీఆర్​పాలనలో విద్యా, వైద్యం, వ్యవసాయం.. ఇలా అన్ని రంగాలు ధ్వంసమయ్యాయన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వేల బడులను మూసిశారని, ఆరువేల బడుల్లో ఒక్కరే టీచర్ ఉన్నారని గుర్తుచేశారు. ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని, స్టూడెంట్లకు స్కాలర్ షిప్​లు, ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సభలో శ్రవణ్ రాజ్, ప్రవీణ్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీహరి, సురేష్  తదితరులు పాల్గొని మాట్లాడారు.