ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
  • పోడు భూమిలో ట్రెంచ్ కొట్టకుండా ఆపేందుకు రూ.30 వేలు డిమాండ్ 
  • అధికారితో పాటు మీడియేటర్ ను పట్టుకున్న ఏసీబీ

ఆళ్లపల్లి, వెలుగు : పోడు భూమిలో ట్రెంచ్ కొట్టకుండా ఉండేందుకు లంచం తీసుకున్న భద్రాద్రి జిల్లాకు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం, రామానుజగూడెం పరిధిలోని అటవీ భూమి చుట్టూ ఆఫీసర్లు ట్రెంచ్ (కందకం) కొడుతున్నారు.

ఈ క్రమంలో తన భూమిలో ట్రెంచ్ కొట్టొద్దని ఓ పోడు రైతు కాచనాపల్లి రేంజ్ వలసల బీట్ ఆఫీసర్ రవికుమార్ ను కోరగా ఆయన రూ. 30 వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తానని బీట్ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వగా.. ఆయన తన ఏజెంట్ సాధిక్ ను పంపించారు. సాధిక్ రాయలంక గ్రామం వద్దకు రాగా.. రైతు ఆయనకు రూ. 30 వేలు ఇచ్చాడు. ఆ డబ్బులను సాధిక్ బీట్ ఆఫీసర్ రవికుమార్ కు ఇస్తుండగా.. ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.